నెల్లూరు(దర్గామిట్ట): బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. యూటీఎఫ్ పిలుపు మేరకు చేపట్టిన ఎన్రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లోని తన చాంబర్‌లో బుధవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ, విద్యార్థుల నమోదును పెంచడమే ఈ డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని యూటీఎఫ్ నేతలు వెల్లడించారు. రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు శేషులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతిశర్మ, జిల్లా గౌరవాధ్యక్షుడు అచ్చయ్య, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాజావలీ, జిల్లా కార్యదర్శి బాలరాగయ్య, జిల్లా కమిటీ సభ్యుడు మనోహర్‌బాబు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డుల
అందజేత
నెల్లూరు(దర్గామిట్ట): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ సమాజాభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కాంక్షించారు. కలెక్టరేట్లోని తన చాంబర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వీటిని అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, డివిజనల్ పీఆర్వోలు రవికుమార్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ పీజీ సెట్
నోటిఫికేషన్ విడుదల
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో 2026 – 27 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ హనుమారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కళలు, శాస్త్రాలు, వాణిజ్యం, ప్రొఫెషనల్ కోర్సులకు ఈ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లను నిర్వహించనున్నారని వెల్లడించారు. దరఖాస్తు సమర్పణకు ఈ నెల తొమ్మిది తుది గడువని, అపరాధ రుసుముతో ఈ నెల 23 వరకు అవకాశం ఉందని చెప్పారు. 24, 25న సవరణ, ఏప్రిల్ 21 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, మే ఐదు నుంచి 11 వరకు రోజూ మూడు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారని ప్రకటించారు. అందుబాటులో ఉన్న కోర్సులు, ఫీజులు ఇతర వివరాలకు వీఎస్‌యూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
వైద్యశాఖలో ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల
నెల్లూరు(అర్బన్) జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఎన్‌హెచ్‌ఎం విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని డీఎంహెచ్‌ఓ సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు మెరిట్ జాబితాను spsnellore. ap. gov. in/ recruitmentలో పరిశీలించాలని కోరారు. అభ్యంతరాలుంటే తగు ఆధారాలను వైద్యశాఖ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రంలోపు సమర్పించాలని కోరారు.
పాలను కల్తీ చేస్తే చర్యలు
నెల్లూరు(అర్బన్): పాలు, పాల పదార్థాలను కల్తీ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాలసేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ స్టాళ్లలో తనిఖీలను ఫుడ్ సేఫ్టీ విభాగాధికారులు కొద్ది రోజులుగా చేపట్టి నమూనాలను సేకరించారు. ఈ క్రమంలో ట్రంక్‌రోడ్డు సమీపంలోని ఓ సమావేశ మందిరంలో వ్యాపారులతో అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు.


