విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విద్యార్థులు పోటీతత్వంతో చదవాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో గురువారం సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌ను వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు, వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా సమగ్ర శిక్షణతోపాటు, సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని చెప్పారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి వీఎస్‌యూకు పేరు తీసుకురావాలన్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా నిపుణలచే శిక్షణ, పరీక్షలపై అవగాహన, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు అందించనున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్ డాక్టర్ విజేత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు.


