వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
జిల్లాలోని వేర్వేరు మండలాల్లో జరిగిన
రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు.
మోటార్‌బైక్‌లు ఢీకొని..
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి సమీపంలో ఎదురెదురుగా రెండు మోటార్‌బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని రామానాయుడుపల్లికి చెందిన రామయ్య మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఆత్మకూరు మండలం వెన్నవాడలో మోటార్ మరమ్మతులు చేసి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. అదే సమయంలో డీసీపల్లి నుంచి వెన్నవాడకు రాజమండ్రికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి అతడిని హైవే అంబులెన్స్‌లో ఆత్మకూరు వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మోకానిక్ రామయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.
బైక్‌ను ఢీకొట్టిన కారు
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని జువ్వగుంటపాళెం బస్టాండ్ వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జువ్వగుంటపాళేనికి చెందిన కుమ్మెద శ్రీధర్ పొలం పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో వింజమూరు నుంచి దుత్తలూరు వైపు వెళ్తున్న వరికుంటపాడు ఎస్పీడీసీఎల్ సిబ్బందికి చెందిన కారు రోడ్డుకు అడ్డంగా వెళ్తుతున్న ఓ బాలుడిని తప్పించబోయి బైక్‌ను ఢీకొట్టి రోడ్డు కిందికి వెళ్లిపోయింది. దీంతో శ్రీధర్ కాలికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చైన్నెకి తీసుకెళ్లారు. ఈ ఘటనలో కారు, బైక్‌లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై వీరప్రతాప్ తెలిపారు.
వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు


