పిల్లల మధ్య న్యూ ఇయర్ వేడుకలు
నెల్లూరు(దర్గామిట్ట): అనాథ పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని ఆర్‌కే నగర్‌లో ఉన్న జనహిత వాత్సల్య అనాథాశ్రమాన్ని కలెక్టర్ సందర్శించారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. తొలుత బాలికల కోలాట ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లలతో గడపడం తనకెంతో ఇష్టమన్నారు. ఎటువంటి ప్రభుత్వ తోడ్పాటును ఆశించకుండా దాతల సహకారంతో మూడు దశాబ్దాలకు పైగా ఆశ్రమాన్ని నిర్వహించడం, విలువలతో కూడిన విద్యా బోధన అందించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు నిఘంటువులు, నోట్ పుస్తకాలు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాక్షించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రిని త్వరలో అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ సాంబశివరావు పాల్గొన్నారు.


