ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: నా నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే సహించేది లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారు మా పార్టీ వారైనా ఉపేక్షించేది లేదంటూ పలు సందర్భాల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది వేరు. టీడీపీ నేతలు షాడో మంత్రి అండదండలతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నారు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ, ఇరిగేషన్‌కు సంబంధించిన రూ.కోట్ల విలువ చేసే స్థలాలను కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇతరులకు అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా రూ.కోటి విలువైన మూడెకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసి వారి ఆధీనంలో పెట్టుకున్నారు.
వ్యతిరేకిస్తూ..
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై స్థానికుడైన ఈశ్వర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. దీంతో టీడీపీ నాయకులు ఈశ్వర్, అతని కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు భౌతిక దాడులకు పాల్పడిన ఘటనలున్నాయి. అతను ఆధారాలతోసహా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. గతంలో మూడుసార్లు అధికారులు ఇది ప్రభుత్వ స్థలం అని బోర్టులు పెట్టిన చోటే ఆక్రమణ నిర్మాణాలు చేస్తుడటం విశేషం. ఇటీవల భగత్‌సింగ్ కాలనీలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని పైతం కూల్చేసి నిర్మాణాలు సాగిస్తున్నారని ఈశ్వర్ నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ రూపంలో నిరసనకు దిగారు.
అధికారులను అడ్డుకుని..
కొన్నిరోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆక్రమిత స్థలాల సర్వే కోసం వస్తే వారిని మహిళలతో బెదిరించి అధికారులను సైతం అడ్డుకుని దాడులకు యత్నించారు. నాయకుల తీరుతో చేసేదేమీ లేక అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతానికి ఏ అధికారి వెళ్లాలన్నా భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టీడీపీ నేతల ఇష్టారాజ్యం
రూ.కోట్ల విలువైన స్థలాలు,
భూముల కబ్జా
స్కూల్ భవనాన్ని కూల్చి మరీ
అక్రమ నిర్మాణాలు
అధికారులపై దాడికి
పాల్పడుతున్న పచ్చమూకలు
కాపాడేందుకు ఓ వ్యక్తి పోరాటం
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం


