రైతులకు యాజమాన్యాలు అండగా ఉండాలి
● మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలి
● ఉద్యోగాలు, పనుల్లో స్థానికులకే ప్రాధాన్యం
● ‘ఇథనాల్’ ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్
కొడవలూరు: ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేసే యాజమాన్యాలు భూములిచ్చిన రైతులకు అండగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మండలంలోని రాచర్లపాడులో గల ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేయనున్న రాంషీ బయో, గాయత్రి బయో ఇథనాల్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరైన ఆయన మాట్లాడారు. 2776 ఎకరాలను 30 ఏళ్ల క్రితమే రైతులిచ్చారని, అప్పట్నుంచి అందులో పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని ఎదురుచూస్తూనే ఉన్నారని చెప్పారు. ఉద్యోగాలకు కొందరికి వయోపరిమితి దాటిపోయిందని తెలిపారు. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే వారు భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలను తప్పక ఇవ్వాలని చెప్పారు. నిర్మాణ పనుల్లోనూ ఈ కుటుంబాలకే అఽధిక ప్రాధాన్యనివ్వాలని కోరారు. ధాన్యం ఆధారిత పరిశ్రమలైన తరుణంలో కర్షకుల వద్ద ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. నూకలు సైతం ఉపయోగపడనున్న తరుణంలో, నాణ్యత తగ్గిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఒకవేళ మాట తప్పితే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హామీ ఇచ్చారు. సీఎస్సార్ నిధులతో భూములిచ్చిన గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే మూతే
ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి కాలుష్యం రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని యాజమా న్యాలు చెప్తున్నాయని తెలిపారు. నీటిని వృథా చేయకుండా రీసైక్లింగ్ చేస్తామని స్పష్టంగా హామీ ఇస్తున్నాయని చెప్పారు. వీటిని ఉల్లంఘించి కాలుష్యానికి కారణమైతే రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని ఫ్యాక్టరీలను నిలిపేసే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిశోర్‌కుమార్, సెజ్ సీఈఓ సుధాకర్, ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దార్లు స్ఫూర్తిరెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, ఎంపీడీఓ వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


