విలువలకు పాతరేసి అడ్డగోలు రాజకీయాలా..?
● మంత్రి నారాయణ తీరు విచారకరం
● ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి ‘ఎన్’ టీమ్‌కే లబ్ధి
● ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు రూరల్: తానో అధ్యాపకుడిననే అంశాన్ని విస్మరిస్తూ.. అడ్డగోలు రాజకీయాలను మంత్రి నారాయణ సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. నగరంలో సామాన్యులకు రక్షణ కరువైందని, ఎప్పుడెలాంటి దాడి జరుగుతుందోననే ఆందోళనతో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. 2021లో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరులో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ తమ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని, అయితే ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలు నచ్చక ఐదుగురు కార్పొరేటర్లు.. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరగా, వారిపై అక్రమ కేసులు నమోదు చేసి బెదిరించారని ఆరోపించారు. ఆరో డివిజన్ కార్పొరేటర్ కుమారుడు మద్దినేని శ్రీధర్‌ను విజయవాడలో కిడ్నాప్ చేయించి.. కావలి, తిరుపతిలో తిప్పి అక్రమ కేసును నమోదు చేశారని ధ్వజమెత్తారు. వీటిని పునఃపరిశీలించాలని ఎస్పీని కోరారు. మంత్రి నారాయణ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ సామాన్యుల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పేవన్నీ వాస్తవాలేనని, అబద్ధమైతే కేసును నమోదు చేయొచ్చన్నారు. 13వ డివిజన్లో పేద దళిత మహిళకు సంబంధించిన బాత్రూమ్‌ను కమిషనర్ దుర్మార్గంగా కూల్చేశారని, నారాయణకు ఓటేయలేదనే కారణంతో ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. తమ పార్టీ 15వ డివిజన్ నేత బాలకృష్ణారెడ్డికి చెందిన రూ.రెండు కోట్ల విలువజేసే ఇంటిని జేసీబీతో పడగొట్టారని, 51వ డివిజన్ నేత శౌరి దుకాణాలను నిలువునా కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏకపక్షంగా అడ్మిషన్లు
వీఆర్ మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్లను ఏకపక్షంగా జరిపారని, ఎన్ టీమ్‌కు సంబంధించిన వారి పిల్లలకే ప్రవేశాలను కల్పించారని మండిపడ్డారు. 1046 అడ్మిషన్లన్నీ వీరి సిఫార్సు ద్వారా ఇచ్చినవేననే అంశాన్ని తమ పార్టీ ఇప్పటికే బయటపెట్టిందని వివరించారు. బయటి వారు దరఖాస్తు చేసుకున్నా, అడ్మిషన్లను ఇవ్వలేదని ఆరోపించారు. జాఫర్‌సాహెబ్ కాలువ వద్ద దుకాణాల ఏర్పాటుతో కాలుష్యం ఏర్పడి పూడిపోయే ప్రమాదం ఉందంటూ ఎన్జీటీని తమ పార్టీ ఆశ్రయించిందని, అయితే ఆ ఆదేశాలను సైతం లెక్కచేయలేదని విమర్శించారు. దుకాణ సముదాయంలో బయటి వారు, అక్కడ ఇళ్లు కోల్పోయిన 200 మంది దరఖాస్తు చేసుకుంటే, వారికి కాకుండా ఎన్ టీమ్‌కే కేటాయించారని మండిపడ్డారు. పారదర్శకత లేకుండా తన వద్ద ఉన్న వారికే లబ్ధి చేకూర్చేలా మంత్రి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
పేదలంటే అంత చులకనా..?
బఫర్ జోన్ అంటూ నెల్లూరులో కాలువల పక్కన ఉన్న నివాసాలను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 2500 ఓట్లు పోతాయి.. తనకు లెక్కే కాదు.. కూల్చేయండంటూ మాట్లాడటం పేదలపై ఆయనకు ఉన్న వైఖరిని తెలియజేస్తోందన్నారు. రైల్వేస్టేషన్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి విగ్రహం వరకు కాలువల పక్కన దుకాణాలను ఏర్పాటు చేసి తన టీమ్‌కు ఇచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాల్లో పనిచేస్తున్న కొందరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి తనకు అనుకూలమైన వారికి ఆయన కట్టబెట్టారని చెప్పారు. అక్రమ కేసులు బనాయిస్తాం.. రౌడీషీటర్లను రోడ్లపై వదులుతామంటే చూస్తూ ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు.


