నిధుల స్వాహా.. అడిగేదెవరు?
నెల్లూరు(పొగతోట): జిల్లా వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రుణాల మంజూరు, రికవరీ నిధులు స్వాహా చేయడం పరిపాటిగా మారింది. దొరికితే దొంగలు దొరక్కపోతే దొరలు అనేలా ఈ తంతు సాగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళల ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రతి సంవత్సరం రూ.వందల కోట్ల బ్యాంక్ లింకేజ్, సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తున్నారు. మంజూరు, రికవరీల విషయంలో గోల్‌మాల్ జరుగుతుందనే విమర్శలున్నాయి. బ్యాంకు లింకేజ్, సీ్త్రనిధి రుణాల మంజూరుకు 5 నుంచి 10 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇది చాలదన్నట్లు మహిళలు తిరిగి చెల్లిస్తున్న నగదు బ్యాంక్‌లకు జమ చేయకుండా దిగమింగుతున్నారు.
అందువల్లే..
గ్రామ సంఘ బంధానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. విడ్డూరంగా 4, 5 బ్యాంకు అకౌంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిధుల స్వాహా చేయడం సులభతరమవుతోంది. గ్రామ, మండల సమాఖ్యల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల అమలుకు విడుదల చేస్తున్న నిధులు కూడా జేబుల్లో వేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అవసరాల నిమిత్తం సీసీలు, ఏపీఎంలు, అకౌంటెంట్లు అడిగినంత ఇచ్చి రుణాలు పొందుతున్నారు. దీనికి బ్యాంక్ అధికారుల సహాయ సహాకారాలు, ఉండడంతో అధికారులు ఆడింది ఆట.. పాడిందే పాటగా ఉంది.
రూ.750 కోట్ల మంజూరు
జిల్లాలో 37,905 స్వయం సహాయక గ్రూపులున్నాయి. సుమారు 4 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,336 కోట్ల లింకేజ్ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు రూ.750 కోట్లను మంజూరు చేశారు. సీ్త్రనిధి రుణాలు రూ.300 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం. మహిళలకు శిక్షణ పేరుతో ప్రతి సంవత్సరం రూ.లక్షలు విడుదలవుతున్నాయి. ఈ మొత్తాన్ని పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో జిల్లా సమాఖ్య సభ్యులు ఖాళీ చెక్‌లపై సంతకాలు చేయించుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
ఎక్కడ ఎంతంటే?
రాపూరు మండలంలో ఎస్టీల అభివృద్ధి పేరుతో భారీ స్థాయిలో నిధులు స్వాహా చేశారు. ఈ మధ్య రూ.1.20 కోట్లు గోల్‌మాల్ జరిగిందని సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. అయితే రికవరీల పేరుతో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యల్లేవు. ఈ విషయంపై గోప్యంగా విచారణ జరుగుతోంది. ఇద్దరు ఏపీఎంలు, ఆరుగురు సీసీల ప్రమేయం ఉందని సమాచారం. వలేటివారిపాళెం మండలంలో రూ.18.72 లక్షలకు సంబంధించి అక్రమాలు జరిగాయి. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరపలేదు. కేవలం అకౌంటెంట్‌ను మాత్రమే బాధ్యుడిని చేశారు. ఎస్‌ఆర్‌పురంలో ఏపీఎంపై నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. వింజమూరు మండలంలో మహిళా మార్టు పేరుతో నిధులు తిన్నారని ఆరోపణలొచ్చాయి. అధికారులు విచారించి అలా జరగలేదని, గుర్తించిన ఏజెన్సీల నుంచి కాకుండా ఇతర ఏజెన్సీల్లో వస్తువులు కొనుగోలు చేశారని తేల్చారు. దానికి సంబంధించి ఏపీఎంపై చర్యలు తీసుకున్నారు. ఏఎస్‌పేటలో రూ.1.20 లక్షలు, మర్రిపాడులో రూ.1.50 లక్షలకు అక్రమాలు జరిగాయి. తూతూమంత్రంగా విచారించి సీసీలపై చర్యలు తీసుకున్నారు. గతంలో వివిధ మండలాల్లో పనిచేసిన సీపీ రూ.లక్షలు స్వాహా చేశారు. దీనిపై స్పందన లేదు. జిల్లాలో ఎస్టీలు అధికంగా ఉన్నారు. వారి పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి రూ.లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రూపుల సభ్యులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు.
రాపూరులో రూ.1.20 కోట్లు,
వలేటివారిపాళెంలో రూ.18.72 లక్షలు
ఏఎస్‌పేట, మర్రిపాడు, వింజమూరు తదితర మండలాల్లోనూ..
ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్ల కీలకపాత్ర
రుణాలు కావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే
రికవరీలు చేస్తున్నాం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. రుణాలు మంజూరు చేయించి జీవనోపాధులు కల్పిస్తున్నాం. నిధులు స్వాహా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కేసులు నమోదు చేయడం, విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాం. రాపూరు మండలంలో జరిగిన అవినీతిపై నిధులు రికవరీ చేసేలా చర్యలు తీసుకున్నాం.
– నాగరాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ


