కుటుంబ కలహాలతో..
● వివాహిత బలవన్మరణం
ఆత్మకూరు: కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం తూర్పు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. కాలనీకి చెందిన రాఘవేంద్ర, పెంచలమ్మ (30) దంపతులకు పిల్లల్లేరు. పెయింట్ పనులు చేసే రాఘవేంద్ర మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం మధ్యాహ్నం చిన్న గొడవ అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో పెంచలమ్మ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి అనంతరం బంధువులు పరిశీలించి మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎస్‌కే జిలానీ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు.
న్యాయశాఖ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
నెల్లూరు(లీగల్): న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం నెల్లూరులోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొహిబిషన్ పూర్తయిన న్యాయశాఖ ఉద్యోగులకు జనవరి నెలలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం నూతన ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పనిచేసి న్యాయశాఖకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పరిపాలన అధికారిణి నాగరాణి, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీ నారాయణరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సీహెచ్ పోలయ్య, సీహెచ్ వెంకటేశ్వర్లు, శివప్రసాద్‌బాబు, నాయకులు సురేంద్రబాబు, దినేష్‌కుమార్, అయితా మల్లికార్జునరావు, ఎల్.దర్గా, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని
వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సౌత్ రైల్వేస్టేషన్‌లో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై సోమవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 63 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. పసుపు రంగు టీ షర్టుపై పాచిరంగు స్వెట్టర్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
60.840 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 60.840 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
కుటుంబ కలహాలతో..


