ఆడుకుంటూ అనంతలోకాలకు..
● బంతి కోసం వెళ్లిన బాలుడు
● టిప్పర్ చక్రాల కింద నలిగిన ప్రాణం
సైదాపురం: ఆడుకుంటూ బంతి కోసం రోడ్డు దాటుతున్న బాలుడు టిప్పర్ చక్రాల కింద నలిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాదకర ఘటన సైదాపురంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా దొరవారిసత్రానికి చెందిన పన్నీరస ఆదినారాయణ, సుష్మ దంపతులకు దక్షేష్ (5) అనే కుమారుడు ఉన్నాడు. బాలుడు సైదాపురంలో ఎస్టీ కాలనీలో కాపురం ఉంటున్న తన అమ్మమ్మ కర్రెద్దుల పద్మమ్మ వద్ద ఉంటున్నాడు. సోమవారం ఉదయం దక్షేష్ బ్యాట్, బాల్‌తో ఆడుకుంటున్నాడు. బంతి రోడ్డుపైకి వెళ్లగా దాని కోసం బాలుడు వెళ్లాడు. రాపూరు మండలంలోని పులిగిలపాడులోని పీఎల్‌ఆర్ రోడ్డు మెటల్ క్రషర్ నుంచి టిప్పర్ కంకరతో గూడూరుకు వెళ్తోంది. బాలుడిని తప్పించే క్రమంలో అంగడిని ఢీకొట్టింది. కానీ ఏం జరిగిందో గానీ దక్షేష్ వెనుక చక్రాల కింద పడి నలిగిపోయాడు. అమ్మమ్మ గుర్తించి వెంటనే స్థానికుల సాయంతో గూడూరు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ దక్షేష్ మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఘటనా స్థలంలో బ్యాట్, చెప్పులను రక్తపుమడుగులో చూసి స్థానికులు కంటతడి పెట్టారు. కాగా టిప్పర్ ఢీకొన్న సమయంలో అంగట్లో ఎవరూ లేకపోవడంతో మరో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. రాపూరు నుంచి నిత్యం అధిక టన్నేజీతో టిప్పర్లు వేగంగా వెళ్లడంపై విచారణ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఆడుకుంటూ అనంతలోకాలకు..


