ఫిర్యాదుల వెల్లువ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 111 మంది విచ్చేసి తమ సమస్యలను ఎస్పీ అజిత దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. చట్ట పరిధిలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్, మహిళా స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వినతులిలా..
● ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని కావలికి చెందిన నవీన్ నమ్మించి రూ.7 లక్షలు తీసుకుని మోసగించాడు. నగదు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని కావలికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● వ్యాపారి రూ.65 లక్షల ధాన్యాన్ని నా వద్ద కొనుగోలు చేశాడు. పలువురు రైతుల వద్ద సుమారు రూ.కోటి విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎవరికీ నగదు ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయాడు. ఆచూకీ కనుక్కొని న్యాయం చేయాలని కోవూరుకు చెందిన ఓ రైతు కోరాడు.
● కృష్ణవేణి అనే మహిళ నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకుని ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ నన్ను, నా భర్తను చంపుతామని బెదిరిస్తోంది. ఆమె బారి నుంచి రక్షణ కల్పించాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.
● మాకు ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న మమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని సంగంకు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు.
● నా కుమారుడు కనిపించడంలేదు. నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కుమారుడి ఆచూకీ కనుక్కోవాలని నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ కోరారు.
● నా భర్త, అత్తమామలు మానసికంగా వేధిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న నా ఇద్దరు పిల్లలను సైతం ఇబ్బంది పెడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని జలదంకి ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.


