విలీన ప్రతిపాదనపై ప్రసన్న హర్షం
● ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ
● వ్యతిరేకతతో దిగొచ్చిన సర్కార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని గత ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆర్భాటపు హామీలను గుప్పించారు. ఇది నిజమేనని భావించి ఓటేసిన ప్రజలకు ఆయన అసలు రంగు తర్వాత బోధపడింది. వాగ్దానాన్ని విస్మరించడంతో పాటు జిల్లాలోనే ఉన్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలనూ తిరుపతిలో కలపాలని ఇటీవల ఆయన నిర్ణయించడంపై ప్రజానీకం భగ్గుమంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన ఎలా వ్యవహరిస్తారని పలువురు ప్రశ్నించారు. సాంస్కృతికపరంగా.. భౌగోళికంగా నెల్లూరుతో ముడిపడిన గూడూరును అసలు సంబంధంలేని తిరుపతి జిల్లాలో ఎలా కొనసాగిస్తారంటూ ఎక్కడికక్కడ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కందుకూరును ప్రకాశంలో కలిపేలా నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇది తమకు ఎందుకు వర్తించదంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనం.. మౌనవ్రతం
వెంకటగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో గతంలో విలీనం చేసినప్పుడు, రాపూరు, సైదాపురం, కలువాయిని అక్కడ చేర్చొద్దంటూ అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని నాటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ప్రస్తుతం వీటి విలీనానికి సర్కార్ సై అనగా, మంత్రి హోదాలో ఉన్న ఆనం మాత్రం మౌనవ్రతం దాల్చారు. ఈ పరిణామం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
నీటి పంపకాల్లో సమస్యలు
జిల్లాలో సాగునీటికి కీలకంగా ఉండేవి సోమశిల, కండలేరు జలాశయాలు. ఈ తరుణంలో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేస్తే, రెండు ప్రాంతాల మధ్య జల వివాదాలు చోటుచేసుకునే ప్రమాదాలూ లేకపోలేదు. దీన్ని నిరసిస్తూ ఆ మండలాల ప్రజలు రోడ్డెక్కారు. తమకు జరుగుతున్న అన్యాయంపై మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ వినతిపత్రాలను అందజేసి తమ నిరసనను వ్యక్తపర్చారు.
గూడూరుపై ప్రసన్న పట్టు
గూడూరు విషయంలో ఉద్యమానికి కార్యాచరణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఆమరణ దీక్షకు పూనుకుంటానని ప్రకటించారు. దీనికి సహకరించాలంటూ నేతలను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో అప్పటి వరకు మౌనంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ప్రజా వ్యతిరేకతను గమనించి రంగంలోకి దిగుతున్నట్లు షో చేశారు. ఫలితంగా గూడూరుతో పాటు వెంకటగిరిలోని మూడు మండలాలను జిల్లాలోనే కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కోవూరు: గూడూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను గమనించి, తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని నిర్ణయించడం శుభపరిణామమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనే డిమాండ్ వెనుక ప్రజల భావోద్వేగాలున్నాయని చెప్పారు. ఇదే అంశమై ప్రజల పక్షాన తాను గళమెత్తానని గుర్తుచేశారు. అవసరమైతే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోనని గతంలోనే ప్రకటించానని, ఆ పట్టుదలే ఈ నిర్ణయానికి దారితీసిందని అభిప్రాయపడ్డారు. అక్కడి వ్యాపార, విద్య, వైద్యావసరాలన్నీ నెల్లూరుతోనే ముడిపడి ఉన్నాయని వివరించారు. జిల్లాలో గూడూరును కలపాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలను తెలియజేశారు.
విలీన ప్రతిపాదనపై ప్రసన్న హర్షం


