ప్రజల కంటే కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమా..?
● ఇథనాల్ పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు
● రౌండ్ టేబుల్ సమావేశంలో
నేతల తీర్మానం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కంటే కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమవుతున్నాయని.. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. రాచర్లపాడులోని కిసాన్ సెజ్‌లో ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటును నిరసిస్తూ ‘ప్రజారోగ్య పరిరిక్షణకు ఇథనాల్ ఫ్యాక్టరీలను వ్యతిరేకించండి.. కాలుష్య భూతం నుంచి ప్రజలను కాపాడండి అనే నినాదంతో నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడారు. ఉపాధి కోసం పరిశ్రమలొస్తే తప్పు లేదని, అయితే ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే విష వాయువులను విడుదల చేసే ఫ్యాక్టరీలను కచ్చితంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వాయు, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో వీటిని ప్రజలు వ్యతిరేకించిన అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడారు. ఇథనాల్ ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తే జిల్లా ప్రజల పరిస్థితి దారుణమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. సీపీఐఎమ్మెల్ నేత రాంబాబు మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయకుండా వీటికి అనుమతివ్వడం సరికాదన్నారు. ఎస్‌యూసీఐ నేత బసవరాజు మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు రాష్ట్ర సంపదను దోచి పెట్టేందుకే వీటికి అనుమతులిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకునేందుకు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సీపీఐఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. కిసాన్ సెజ్ భూముల్లో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి అనుమతుల్లేవని చెప్పారు. ఇఫ్కో ఫ్యాక్టరీకి కేటాయించిన భూముల్లో వీటిని నిర్మించతలపెట్టడం దారుణమన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇలాంటి పరిశ్రమలతో ఉపాధి లభించకపోగా, ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకావాలి
రాచర్లపాడులోని కిసాన్ సెజ్ వద్ద మంగళవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రజలు భారీగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడు సంజయ్‌కుమార్ కోరారు. నేతలు కత్తి శ్రీనివాసులు, మోహన్‌రావు, సుధీర్, శివశంకర్, పుల్లయ్య, నరసింహ, రషీద్, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.


