● గూడూరు, వెంకటగిరిలోని మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోన
ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిల్లాల పునర్విభజనలో నెల్లూరుకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున రేగగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి నిరసనలు చేపట్టింది. ఈ పరిణామాల క్రమంలో సర్కార్ దిగొచ్చిందని తెలుస్తోంది. గూడూరుతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. మరో వైపు దీనిపై ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుండి నడిపించిన వైఎస్సార్సీపీ
వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను తిరుపతిలో కలపకూడదంటూ ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. కలువాయి మండల ప్రజలు ఏకతాటిపై నిలిచారు. వీరికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కలువాయి జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమ తీవ్రతను పెంచారు. మండల, జెడ్పీ సమావేశాల్లో తీర్మానాలనూ చేయించారు. కలువాయిలో భారీ స్థాయిలో ర్యాలీలను నిర్వహించి ఉద్యమ గళాన్ని వినిపించారు. రాపూరు, సైదాపురంలో ర్యాలీలు, బంద్‌లను నిర్వహించారు. ఇలా అందరూ ఏకమవడంతో నిరసన సెగకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.


