ఇంత తక్కువకు భూములివ్వలేం
● రుద్రకోట రైతులతో సమావేశం
● అధికారులు నిర్ణయించిన పరిహారంపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి నెల్లూరు: బీపీసీఎల్ పరిశ్రమకు సంబంధించిన భూసేకరణలో భాగంగా పొలాలను కోల్పోతున్న రుద్రకోట రైతులతో సమావేశాన్ని కావలి ఆర్డీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. అధికారులు నిర్ణయించిన పరిహారంపై రైతులు భగ్గుమన్నారు. ఎకరాకు రూ.కోటి చొప్పున ఇవ్వడంతో పాటు 2013 భూసేకరణ చట్టం మేరకు పరిశ్రమలో వాటాలివ్వాలని డిమాండ్ చేశారు.
ఎకరాకు రూ.24 లక్షలేనా..!
బీపీసీఎల్ రిఫైనరీ కోసం కావలి మండలంలోని తీర గ్రామం చెన్నాయపాళెంలో ఎకరాకు రూ.24 లక్షలను నిర్ణయించామని అధికారులు ప్రకటించారు. రుద్రకోటలోని భూములకు సైతం ఇదే వర్తిస్తుందని వారు తెలియజేయడంతో ఆ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. చెన్నాయపాళెంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ.మూడు లక్షలు కాగా, అక్కడ రూ.24 లక్షలను ప్రకటించారని, అయితే రూ.7.59 లక్షల రిజిస్ట్రేషన్ విలువ ఉన్న రుద్రకోటలో సైతం అంతే ఇస్తామనడం తమకేమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. నిష్పత్తి మేరకు రుద్రకోటలో ఎకరాకు రూ.56 లక్షలవుతాయని వివరించారు. పైగా తమ గ్రామం జాతీయ రహదారి, రైల్వే లైన్‌కు దగ్గరగా ఉందని, బహిరంగ మార్కెట్లో రూ.మూడు కోట్లు పలుకుతున్నాయని వివరించారు. గ్రామదేవత అంకమ్మ తల్లి భూములకు మినహాయింపునివ్వాలని కోరారు.
నాటి పరిహారాన్ని
ఎందుకు పట్టించుకోవడంలేదు..?
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూములను సేకరించినప్పుడు ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఇచ్చారని, దీంతో సంతోషంగా అప్పగించామన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతులను దోచుకునేందుకు, వారి జీవితాలను అల్లకల్లోలం చేసేందుకు యత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిహారాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
ఉద్యోగమనేది.. మభ్యపెట్టేందుకే..!
అధికారులు చెప్తున్న ‘ఇంటికో ఉద్యోగం’పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆశ చూపి తమ పొలాలను లాక్కుంటారని, ఆ తర్వాత అవసరమైన నైపుణ్యం లేదంటారన్నారు. గట్టిగా అడిగితే సెక్యూర్టీ ఉద్యోగాలిచ్చి.. హిందీ, ఇంగ్లిష్ మాట్లాడటం రాదంటూ ప్రొబేషన్‌పూర్తయ్యేలోపే తొలగిస్తారని చెప్పారు. గతంలో కొన్ని పరిశ్రమల ఏర్పాటులో ఇతర గ్రామాల్లో ఎదురైన ఘటనలను ఉదహరించారు. రుద్రకోటలో బీపీసీఎల్ పరిపాలన కార్యాలయ భవనాలను నిర్మించనున్నారని, రైతులు తెలియజేసిన అంశాలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అభిప్రాయ సేకరణ కోసమే సమావేశాన్ని నిర్వహించామని ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు. రైతులు తుళ్లూరు మల్లికార్జున, శ్రీనివాసులు, వాకా చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


