గిరిజనులపై ఎందుకింత వివక్ష..?
● ఓ వ్యక్తి కోసం మమ్మల్ని బలి చేస్తారా..!
● ప్రభుత్వ తీరును తప్పుబట్టిన జయవర్ధన్
నెల్లూరు రూరల్: గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ప్రశ్నించారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్‌లో విలేకరులతో శనివారం ఆయన మాట్లా డారు. ఓ వ్యక్తి కోసం తమను బలి చేస్తారానంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. చట్టాలపై రూప్‌కుమార్‌యాదవ్ మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. ఆయనేదో సాధించాననే రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో అనుసరించిన పద్ధతిని ఇక్కడ ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. అక్కడ ఈ ఏడాది ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానం పెడితే, 28న ఎన్నిక జరిగిందని, మరి దీన్ని ఇక్కడ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఇద్దరు గిరిజన బిడ్డలు టీడీపీలోనే ఉన్నారని, వారికెందుకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు.
వెబ్‌సైట్‌లో
ఎన్నెమ్మెమ్మెస్ తుది కీ
నెల్లూరు (టౌన్): జాతీయ ఉపకార వేతన పరీక్షకు సంబంధించిన తుది కీని విద్యాశాఖ కార్యాలయ వెబ్‌సైట్ www. bse.ap.gov.i nలో అందుబాటులో ఉంచామని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలపై పాఠ్యాంశ నిపుణులతో తనిఖీ చేయించి సవరించిన దాన్ని అందుబాటులో ఉంచామని వివరించారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
ఉదయగిరిలో
జీఎస్‌ఐ సర్వే
ఉదయగిరి: మండలంలోని బండగానిపల్లి, జీ చెర్లోపల్లి, చెరువుపల్లి తదితర ప్రాంతాల్లో రాళ్లు, మట్టి నమూనా సేకరణ సర్వేను హైదరాబాద్‌కు చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శనివారం చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉదయగిరి కొండ ప్రాంతాల్లో గల గ్రామాల్లో విలువైన ఖనిజ సంపదను గుర్తించే నిమిత్తం సర్వేను జరిపామని వివరించారు. వీటిని హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి ల్యాబ్‌లో పరీక్షలు చేపట్టనున్నామని వెల్లడించారు. మర్రిపాడు, ఉదయగిరి, తిరుపతిలోని పలుచోట్ల ఇప్పటికే నమూనాలను సేకరించామని వివరించారు. అభిషేక్ జైన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 72,487 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 29,500 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.52 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
గిరిజనులపై ఎందుకింత వివక్ష..?


