అరటి కేజీ రూపాయే.. | - | Sakshi
Sakshi News home page

అరటి కేజీ రూపాయే..

Nov 26 2025 8:08 AM | Updated on Nov 26 2025 8:08 AM

అరటి

అరటి కేజీ రూపాయే..

అన్నదాతల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో సర్కారు నిర్ణయించిన మద్దతు ధరను కూడా అమలు చేయకపోగా ముఖం చాటేసింది. పంటలకు బీమా లేదు.. ధరల ధీమా లేదు. వరి, మిర్చి, పత్తి, మినుము, వేరుశనగ ధరలు సగానికి పతనమైతే.. మామిడి, అరటి, బత్తాయి, బొప్పాయి పంటలు పాతాళానికి పడిపోయాయి. పెట్టుబడి సాయంలోనూ దగా. ఇన్‌ఫుట్‌ సబ్సిడీకి పంగనామం పెట్టింది.

నెల్లూరు(పొగతోట)/ఉదయగిరి/ఆత్మకూరు రూరల్‌/పొదలకూరు/కోవూరు/కలిగిరి: జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసే అన్నదాత లు ధరల పతనంతో ఆక్రోశిస్తున్నారు. గతంలో ఏ పంటకు చూసినా ధరలు ఆకాశాన్ని తాకితే.. చంద్రబాబు పాలనలో పాతాళానికి పడిపోయాయి. ఇంత దారు ణంగా ధరల్లేక రైతులు విలవిలలాడుతున్నా.. కనీస స్పందన కరువైంది. గతంలో ఏ పంట అయినా.. సగటున కేజీ రూ.25– రూ.30 ఉంటే.. ఇప్పుడు రూపా యి కూడా పలకడం లేదు. జిల్లాలో వరి, పత్తి, మామి డి, సపోటా, అరటి, వేరుశనగ, మినుము, నిమ్మ, బత్తాయి తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెట్టుబడి వ్యయం పెరుగుతున్నా.. ఉత్పత్తి ధరలు మాత్రం దిగజారుతున్నాయి. మరో వైపు ప్రకృతి విపత్తులు అన్నదాతను నిలువునా ముంచేసింది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఎప్పుడు ఏ పంటకు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో డిమాండ్‌ను పెంచి ధరలు కల్పించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రకృతి విపత్తుల్లో నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం చెల్లించి రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి, వారికి అందించాల్సిన సంక్షేమ పథకాలను ఎత్తేసి నిస్సిగ్గుగా రైతన్న.. మీ కోసమంటూ కార్యక్రమాన్ని చేపడుతుందంటూ రైతులు మండిపడుతున్నారు. ఎక్కడ రైతులు నిలదీస్తారో అని.. అధికారులు టీడీపీ సానుభూతిపరులు ఇళ్లకు వెళ్లి ఫొట్‌ షూట్‌తో మమ అనిపిస్తున్నారు.

మోంథా తుఫాన్‌కు నష్టపోయినా.. సరే

ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్‌కు జిల్లాలో పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లితే.. దాన్ని కూడా మూడింతలు తగ్గించి.. అరకొరగా ఎన్యుమరేషన్‌ చేశారు. 594.98 హెక్టార్లలో వరి, 30.49 హెక్టార్లలో సజ్జ, 14.51 హెక్టార్లల్లో వేరుశనగ, 2.74 హెక్టార్లల్లో మొక్కజొన్న, 1.13 హెక్టార్లల్లో అలసంద పంటలు దెబ్బతిన్నాయని, 1065 మంది రైతులు పంటలు నష్టపోయారని ఎన్యుమరేషన్‌ చేసినా.. కనీసం వారికి ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందించే విషయంలో కూడా నేటికీ స్పష్టత లేదు.

వరి ధాన్యం.. రూ.12 వేలు పతనం

వైఎస్సార్‌సీపీ హయాంలో పుట్టి ధాన్యం సీజన్‌ ప్రారంభంలో రూ.24 వేల నుంచి చివరకు రూ.22 వేలకు కొనుగోలు చేశారు. గతేడాది ఖరీఫ్‌, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లలో సాగు చేసిన వరి ధాన్యానికి పుట్టికి రూ.12 వేల వరకు ధరలు తగ్గిపోయాయి. రైతులకు ధరలు కల్పించడంలో కీలకపాత్ర పోషించిన ఆర్బీకేలను నిర్వీర్యం చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా నిర్వహించడంతో దళారులు, మిల్లర్లు దోచుకుంటున్నారు.

పంటలకు బీమా రాదు.. ధరలకు ధీమా లేదు

వరి, మిర్చి, పత్తి, మినుము, వేరుశనగ ధరలు సగానికి పతనం

మామిడి, అరటి, బత్తాయి,

బొప్పాయి రేట్లు పాతాళానికి..

గతంలో సగటున కేజీ రూ.25– రూ.30 ఉంటే.. ఇప్పుడు రూపాయే

ధరలు పతనమవుతున్నా.. నిర్లక్ష్యం

రైతన్న మీ కోసం.. మాయా వేషం

టీడీపీ సానుభూతిపరుల్లో ఫొటో షూట్స్‌

జిల్లాలో 1750 హెక్టార్లలో అరటి సాగు చేసిన రైతులు పంటను పశువులకు వదిలేశారు. గతంలో కేజీ రూ.20 నుంచి రూ.25 వరకు ఉండడంతో అదే ధరలు ఉంటాయని ఆశించిన రైతులకు ప్రస్తుత పంట కాలం శరాఘాతమైంది. కిలో రూపాయికి కూడా కొనే దిక్కులేక.. పంటను వదిలేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో అరటి పండ్లు కేజీ రూ.25 నుంచి రూ.30లకు విక్రయిస్తున్నారు.

పొగాకు ధరలకు పొగబెట్టారు

వైఎస్సార్‌సీపీ హయాంలో ఊహించని స్థాయిలో ధరలు పలికాయి. 2022– 23లో బ్యారనుకు రూ. 2 లక్షల వరకు ఆదాయం రాగా, 2023–24లో రూ.3 లక్షల పైగా ఆదాయం పొందాను. ప్రస్తుతం 2024– 25 పంట కాలానికి ధరలు గణనీయంగా తగ్గాయి. లోగ్రేడ్‌ పొగాకును కొనుగోలు కూడా చేయలేదు. దిగుబడులు బాగా రావడంతో పెట్టుబడులు వచ్చాయి. ఏడాదికి ఏడాదికి పెట్టుబడులు పెరుగుతున్నాయి గానీ ధరలు పెరగడం లేదు.

– వంటేరు మహేంద్ర, పొగాకు రైతు, కృష్ణారెడ్డిపాళెం, కలిగిరి మండలం

అరటి ధర అమాంతం పడిపోయింది

నాకున్న 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. గతంలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉండేది. గతేడాది రూ.13 పలికింది. ఈ ఏడాది రూ.10 అయినా దక్కుతుందని లక్షల్లో పెట్టుబడి పెట్టా. పంట దిగుబడి సుమారుగా ఉన్నప్పటికీ ధరలు పాతాళానికి అంటాయి. కిలో రెండు రూపాయలకు కూడా కొనడం లేదు. అది కూడా గెలలు కోసి, లోడింగ్‌ ఖర్చులు కూడా మేమే భరించాలంట. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధర ఉండేది.

– ఆలూరి వెంకటేశ్వర్లు , ఆత్మకూరు మండలం వెంకట్రావుపల్లి

వేరుశనగ క్వింటాకు రూ.వెయ్యి పతనం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని పంటలతోపాటు వేరుశనగ పంటకు మంచి ధర ఉండేది. క్వింటా 3,600 వరకు పలికితే.. ఇప్పుడు రూ.2600లకు కూడా కొనడం లేదు. ఖర్చులు చూస్తే.. ఎకరానికి రూ.20 వేలు అవుతుంది. దిగుబడి తగ్గింది. 6 క్వింటాళ్ల దిగుబడి వస్తే..రూ.15,600 వచ్చింది. పెట్టుబడిలోనే రూ.4 వేల నష్టపోయాను.

– తిరుపతయ్య , రామచంద్రపురం, విడవలూరు మండలం

నిమ్మ రైతు కంట చెమ్మ

నిమ్మ తోటలు ఉన్న రైతుల కంట చెమ్మ కనిపిస్తోంది. రెండు నెలలుగా ధరలు పతనమయ్యాయి. కోసిన కాయలను మార్కెట్‌కు తరలిస్తే బస్తాకు రూ.100 నుంచి రూ.150 కూడా రావడం లేదు. గతంలో ఎన్నడూ ఇంత దారుణమైన ధరలు లేవు. తోటల్లో కాయలను కోసినా రైతుకు ప్రయోజనం ఉండడం లేదు.

– ఎం.శంకర్‌రెడ్డి, రైతు, ముదిగేడు.

అరటి కేజీ రూపాయే.. 
1
1/5

అరటి కేజీ రూపాయే..

అరటి కేజీ రూపాయే.. 
2
2/5

అరటి కేజీ రూపాయే..

అరటి కేజీ రూపాయే.. 
3
3/5

అరటి కేజీ రూపాయే..

అరటి కేజీ రూపాయే.. 
4
4/5

అరటి కేజీ రూపాయే..

అరటి కేజీ రూపాయే.. 
5
5/5

అరటి కేజీ రూపాయే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement