అడిగేదెవరు.. ఆపేదెవరు
భూమి విలువ సుమారు రూ.కోటి పైనే..
అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా రాజుల కాలం నాటి కోటమిట్టనే ఆక్రమించి పొలాలుగా చేస్తున్నారు. గ్రామంలోని నట్టనడుమ ఆత్మకూరు – చేజర్ల రహదారి పక్కనే రూ.కోటి పైనే విలువైన సుమారు 5.5 ఎకరాలకుపైగా స్థలాన్ని ఆక్రమించి చదును చేస్తున్నారు.
ఆత్మకూరు: పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న బట్టేపాడు గ్రామ నడిబొడ్డున దివ్యమాంబ (దియ్యమ్మ) దేవాలయం ఎదురుగా కోటమిట్ట ప్రాంతం ఉంది. స్థానిక ఎంపీటీసీ సమీప బంధువులు ఆ స్థలంలో మట్టిని తరలించి జేసీబీలతో చదును చేసి పొలంగా మారుస్తున్నారు. వాస్తవానికి సర్వే నంబర్ 898, 899లో కోటమిట్ట ఉంది. రాజుల కాలంలో భటులకు ఇచ్చిన గ్రామంగా భటులవాడ అని పిలిచేవారు. ఇది కాలక్రమేణా బట్టేపాడుగా మారింది. కాగా భటుల కోసం మట్టితో కోటను నిర్మించారు. ఇది పెన్నానదికి సమీపంలో మిట్టపై ఉంటుంది. దీనిని నేడు కోటమిట్టగా పిలుస్తున్నారు.
ఆక్రమించి..
అప్పటి స్థలాలు, కోటలను పురావస్తు శాఖ స్వాధీ నం చేసుకోవడం పరిపాటి. గతంలోనే ఆ శాఖ వారికి రెవెన్యూ అధికారులు తెలిపినా పట్టించుకోలేదని చెబుతున్నారు. కోటమిట్ట ప్రాంతాన్ని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించి రెవెన్యూ అధికారుల సాయంతో 2012లో తమ పేర్లు నమోదు చేయించున్నట్లు సమాచారం. దీనికి ఆనుకుని ఉన్న దొరువుగా పిలిచే ప్రాంతం రికార్డుల మేరకు సర్వే నంబర్ 900లో 3.63 ఎకరాలు విస్తీర్ణంలో ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దొరువును నలువైపులా ఆక్రమించడంతో చిన్నపాటి గుంతగా మారిపోయింది. అప్పట్లో గ్రామ అవసరాలతోపాటు పశువులకు తాగునీటికి ఈ దొరువే ఆధారంగా ఉండేది. ఇంతటి విలువైన కోటమిట్ట, దొరువు ప్రాంతాలు ఆక్రమణకు గురైతే పరిశీలించాల్సిన రెవెన్యూ, పురావస్తు శాఖ అధికారులు అటువైపు చూడటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వీఆర్వో సహకారంతోనే ఆక్రమణల పర్వం చేశారని ఆరోపిస్తున్నారు. దీనికితోడు కోటమిట్టకు సమీపంలోనే ఉన్న మరో మిట్ట ప్రాంతాన్ని ఆక్రమించారు. అక్కడి మట్టిని ఆక్రమిత పొలాలకు తరలిస్తున్నారు.
దర్జాగా కోటమిట్ట ప్రాంతం ఆక్రమణ
టీడీపీ నాయకుల నిర్వాకం
ట్రాన్స్‌ఫార్మర్లకు అనుమతులు ఒకచోట, ఏర్పాటు మరోచోట
పట్టించుకోని పలు ప్రభుత్వ శాఖలు
పరిశీలిస్తాం
రైతుల విషయంలో చూసీచూడనట్లు పోవాలి. అయినా ఈ విషయాన్ని పరిశీలిస్తాం.
– నాయక్, విద్యుత్ శాఖ ఆత్మకూరు
డివిజన్ ఏడీఈ


