రైతులు ఇబ్బందులు పడుతున్నారు
● స్థాయీ సంఘాల సమావేశంలో
లేవనెత్తిన జెడ్పీటీసీ సభ్యులు
● రోడ్లకు మరమ్మతులు చేయించాలి
● జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఆదేశం
నెల్లూరు(పొగతోట): ‘రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో నష్టపోతున్నారు’ అని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ భవన నిర్మాణ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంజూరు చేసిన పనులను పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
సమస్యలు చెప్పి..
రోడ్లు దెబ్బతిన్నాయని ప్రతి సమావేశంలో చర్చిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మర్రిపాడు జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. వివిధ సమస్యలపై సభ్యులు వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. సజ్జ, జొన్న పంటలు సాగు చేయించారని, వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అన్నదాతలు నష్టపోకుండా పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వెటర్నరీ డాక్టర్లను నియమించాలన్నారు. సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, ప్రజలు అవస్థలు పడుతున్నారని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండలాల్లో పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీఓలను నియమించారని అధికారులు వెల్లడించారు. ప్రతి సమావేశంలో పాత నివేదికలనే ప్రస్తావిస్తున్నారని, అభివృద్ధి పనులు జరగడం లేదా అని కలువాయి జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రెండు నెలలకు పెద్దగా మార్పులుండవని పీఆర్ అధికారులు సమాధానమిచ్చారు. అనంతరం విద్య, వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ తదితర శాఖలతో సమీక్షించారు. సమావేశాల్లో జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు పాల్గొన్నారు.


