తెరుచుకున్న గోదాము తలుపులు
● వాస్తవాలు బయటకు చెప్పని
అధికారులు
● బియ్యం మాయంపై ఫిర్యాదు
తీసుకోని పోలీసులు
ఉదయగిరి: ఉదయగిరి సివిల్ సప్లయ్స్ గోదాము తలుపులు తెరుచుకున్నాయి. మంగళవారం జిల్లా సివిల్ సప్లయ్స్ కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ విభాగం) లక్ష్మీనారాయణ వాటిని తెరిచారు. తాత్కాలికంగా గోదాము బాధ్యతలు ఆత్మకూరు కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి అప్పగించారు. ఆయన బియ్యం స్వాహాపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఫిర్యాదు పత్రంలో వివరాలు సమగ్రంగా లేవంటూ పోలీసులు తీసుకోలేదు. దీంతో రెండుగంటలపాటు అక్కడే ఉండి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం సీజ్ చేసిన గోదాము వద్దకు వెళ్లి షట్టర్లు తెరిపించారు.
అనుమానాలు
అక్కడికి వెళ్లిన విలేకరులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దాటవేశారు. ఫొటోలు తీయొద్దని చెప్పారు. రూ.కోట్ల విలువైన పేదల బియ్యం స్వాహా అయితే దాని వివరాలు దాచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంతమేర రేషన్ బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పట్టాయని మీడియా ప్రతినిధులు అడిగినా సమాధానం దాటవేస్తూ జిల్లా మేనేజర్‌ను అడగాలన్నారు. ఓవైపు పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం, మరోవైపు మాయమైన బియ్యం వివరాలు గోప్యంగా ఉంచడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగితే జిల్లా స్థాయి అఽధికారులు రంగంలోకి దిగి దీని వెనుక ఉన్న వారి పాత్రను నిగ్గు తే ల్చి, క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సింది పోయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకోవడంపై విమర్శలున్నాయి.
ప్రజల డిమాండ్
గతంలో పౌరసరఫరాల కార్యాలయంలో అవినీతి వెలుగు చూసిన వెంటనే ప్రభుత్వం రంగంలోకి విచారణకు ఆదేశాలిచ్చింది. అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అప్పుట్లో ఓ జిల్లా స్థాయి అధికారిపై సైతం చర్యలు తీసుకున్నారు. నేడు నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి మనోహర్, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


