విద్యార్థులే కూలీలుగా..
సోమశిల: మండల కేంద్రమైన అనంతసాగరంలోని టీజేఎన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హమాలీలుగా మారిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్కూల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న బల్లలు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని షెడ్ వద్ద మరమ్మతులు చేయించేందుకు సంబంధిత యాజమాన్యం ఆటోని పిలిపించింది. విద్యార్థులను కూలీలుగా మార్చి ప్రధాన రహదారిపై ఉన్న ఆటో వద్దకు బల్లల్ని మోయించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల నుంచి పేద పిల్లలను చదివించేందుకు మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో చేర్పిస్తే పనులు చేయించడం తగదని చెబుతున్నారు.
యువకుడి ఆత్మహత్య కేసులో పలువురి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): యువకుడి ఆత్మహత్య కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నగర ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. వెంకటేశ్వరపురం ప్రాంతంలో రోహిత్ (17) నివాసముంటున్నాడు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువకుడిపై ఈనెల 4వ తేదీన అదే ప్రాంతానికి చెందిన కరిముల్లా, ఉమేరా, ఆసీఫ్, మహబూబ్‌బాషాతోపాటు మరో ఇద్దరు బాలలు దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ కేసు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు కారకులైన నలుగురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకుని జువనైల్ హోమ్‌కు తరలించారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు సిటీ: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రూరల్ మండలంలోని కోడూరుపాడు గ్రామం ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కాలనీలో నివాసం ఉండే పొట్లపూడి చెంచయ్య (21) కూలీ పనులు చేస్తుంటాడు. అతను భార్య అఫ్రిన్‌తో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 23వ తేదీన ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెంచయ్య ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. భార్య కొంతసేపటి తర్వాత గమనించి స్థానికుల సాయంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చెంచయ్య మంగళవారం మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబానికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల అదుపులో గొలుసు దొంగలు
వింజమూరు(ఉదయగిరి): ఈనెల 21న వింజమూరు మండలం చాకలికొండలో పట్టపగలు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. దొంగతనం చేసి బైక్‌లో వింజమూరు వైపు పారిపోతున్న దృశ్యాలు పలుచోట్ల సీపీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరికి గతంలో వేరే చోరీ, ఇతర కేసుల్లో ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. గొలుసును వింజమూరులోని ఓ కుదువ వ్యాపార సంస్థలో పెట్టి నగదు తీసుకున్నట్లు చెబుతున్నారు.
● ఇటీవల వింజమూరు స్టేట్ బ్యాంక్ పక్కన ఓ ఇంట్లో 14 సవర్ల బంగారం దోచుకున్నారు. ఎమ్మాస్సార్ డిగ్రీ కాలేజీ సమీపంలో ఓ సైనికుడి ఇంట్లో దొంగతనం జరిగింది. ఉదయగిరి బీసీ కాలనీలో 37 సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.18
సన్నవి : రూ.8
పండ్లు : రూ.5
విద్యార్థులే కూలీలుగా..
విద్యార్థులే కూలీలుగా..


