కొనడం తప్ప.. గెలిచే దమ్ము లేదు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ‘టీడీపీ నేతలకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము లేదు. పక్క పార్టీలో గెలిచినోళ్లకు నోట్ల కట్టలిచ్చి కొనడం తప్ప. వేరే పార్టీలో గెలిచిన 41 మంది కార్పొరేటర్లకు పచ్చ కండువాలు వేసి తమ పార్టీ అని చెప్పుకోవడం టీడీపీ అధినేత నుంచి అలవాటే. నెల్లూరు నగర మేయర్ ఎప్పుడో మా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వైఎస్సార్‌సీపీకి షాక్ అంటూ ప్రచారం చేసుకోవడానికి టీడీపీ నేతలకు, పచ్చ మీడియాకు సిగ్గుండాలి’ అని మాజీ మంత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాకాణి మాట్లాడుతూ నెల్లూరు నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్విప్ చేసిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ బీఫాంపై గెలిచిన గిరిజన మహిళ పొట్లూరి స్రవంతిని నెల్లూరు నగర మేయర్‌గా చేశామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో మేయర్ కూడా ఆయన వెంట నడిచారని, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలుసన్నారు. అటువంటిది ఇప్పుడు షాక్ అంటూ ప్రచారం చేసుకుంటూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. నిజంగా టీడీపీకి ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము ధైర్యం ఉంటే.. మా పార్టీ బీఫాంపై గెలిచిన కార్పొరేటర్లతో రాజీ నామా చేయించి ఎన్నికలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గిరిజన మహిళను గద్దె దించడానికి అవినీతి నిందలు వేయడం తగదన్నారు. మంత్రి నారాయణకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ అనుభవం లేదని, తమ పార్టీ నాయకులను గెలిపించుకోవడం చేతకాక, వేరే పార్టీలో గెలిచిన వారిని అధికారాన్ని ఉపయోగించి, పోలీసులను పెట్టి లాక్కోవడం అలవాటన్నారు.
అమ్ముడుపోయిన కార్పొరేటర్లు చరిత్రహీనులు
అధికారానికి.. కాసుకులకు అమ్ముడుపోయిన కార్పొరేటర్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. నెల్లూరు నగర మేయర్‌గా ఒక గిరిజన మహిళకు అవకాశం కల్పించామన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా చాలా మంది కార్పొరేటర్లు వేధింపులన్నింటిని తట్టుకొని గట్టిగా నిలబడ్డారన్నారు. జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు, జెడ్పీటీసీ సభ్యులు నెల్లూరు కార్పొరేటర్లు మాదిరిగా టీడీపీకి అమ్ముడు పోలేదన్నారు. వారంతా వైఎస్సార్‌సీపీకి విధేయులుగా ఉండడంతో టీడీపీ అధికారంలో ఉన్నా.. ఏమీ చేయలేక తోక ముడిచిందన్నారు.
అధికారంలో ఉంటే తప్ప.. కానరాడు
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ అధికారంలో ఉంటే తప్ప.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల్లో కనిపించరని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఎప్పుడు పనిచేసినా ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని మభ్యపెట్టి లాక్కునేందుకు తాపత్రయ పడతారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ ఒక్క అభివృద్ధి నెల్లూరు నగరంలో జరగడం లేదన్నారు. 2014–19 మధ్య కాలంలో మంత్రిగా నారాయణ జెడ్పీటీసీలను కార్పొరేటర్లను కొనుక్కునే ప్రయత్నం చేశారని, 2024లో కూడా చంద్రబాబు, లోకేశ్ వద్ద తన ఘనతగా చూపించుకునేందుకు మా పార్టీ కార్పొరేటర్లను కొనడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నెల్లూరు నగరంలో వెనుకబడిన యానాది కులానికి చెందిన మహిళకు మేయర్‌గా, మైనార్టీ నేతకు డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించిన ఘనత జగన్‌మోహన్ రెడ్డిదన్నారు.
● నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో ఒక గిరిజన మహిళకు మేయర్ పదవితోపాటు, 54 మందికి కార్పొరేటర్లుగా అవకాశం వచ్చిందేన్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రలోభాలకు గురైన కార్పొరేటర్ల సహాయంతో ఒక గిరిజన మహిళ గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నారని, అధికార పార్టీని నమ్ముకున్న గిరిజన మహిళకు అవినీతి మరకను అంటించి, గద్దే దించేందుకు అవిశ్వాసం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్లకు అనైతికంగా పచ్చకండువాలేశారు
మేయర్ పొట్లూరి స్రవంతి ఎప్పుడో తమ పార్టీకి రాజీనామా చేశారు
ఆమెకు మా పార్టీతో ఎటువంటి సంబంధం లేదు
వైఎస్సార్‌సీపీకి ఎలాంటి షాక్ తగలలేదు
మంత్రి నారాయణకు బేరసారాలు చేయడం అలవాటే
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


