శనగ సాగు చేస్తే.. ఎకరానికి రూ.35 వేల నష్టం
కొండాపురం మండలం పార్లపల్లికి చెందిన చీకర్ల చంద్రారెడ్డి తనకున్న భూమిలో 5 ఎకరాల్లో శనగ పంట సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో శనగ విత్తనాలు సబ్సిడీతో ఆర్బీకేలు ద్వారా అందజేశారు. దీంతో పెట్టుబడి తగ్గింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక శనగలు రాయితీపై ఇవ్వడం లేదు. గతంలో క్వింటా ధర రూ.8 వేలు పలికితే.. ఇప్పుడు రూ.5 వేలకు కూడా కొనడం లేదని వాపోయాడు. గతంలో దిగుబడి 10 క్వింటాళ్లు వస్తే.. ఇప్పుడు 4–5 క్వింటాళ్లు కూడా రాలేదు. ఎకరానికి రూ.60 వేలు వరకు ఖర్చు అయితే.. దిగుబడులు, ధరలు లేక ఎకరానికి రూ.35 వేల వరకు నష్టం వచ్చిందని కన్నీటి పర్యంతం అయ్యాడు.
బత్తాయి టన్ను
రూ.15 వేలే..
ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు జక్కం శ్రీనివాసరెడ్డి. వరికుంటపాడు మండలం టి.కొండారెడ్డిపల్లి. ఈ రైతు తనకు ఉన్న 10 ఎకరాల భూమిలో బత్తాయి సాగు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక కాపు సరిగా రాలేదు. దీనికి తోడు టన్ను ధర రూ.15 వేలకు మాత్రమే కొనుగోలు చేయడంతో ఎకరానికి రూ.25 వేల వరకు నష్టం వచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేదని ఆ రైతు చెబుతున్నాడు. ఈ ఏడాది బత్తాయి సాగులో తాను సుమారు రూ.2 లక్షలు వరకు నష్టపోయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
శనగ సాగు చేస్తే.. ఎకరానికి రూ.35 వేల నష్టం


