ఉద్యోగం పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన వ్యక్తిపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మాగుంట లేఅవుట్‌కు చెందిన రోహిత్ కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. అతను ఉద్యోగవేటలో ఉండగా నగరానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గూడూరు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.12 లక్షలు తీసుకుని మోసగించాడు. నాగేంద్రను నిలదీయగా రూ.5 లక్షలు ఇచ్చాడు. మిగిలిన నగదు ఇవ్వకుండా అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేశారు.
సిమెంట్ ట్యాంకర్ బోల్తా
● మూడు గంటలకుపైగా
స్తంభించిన ట్రాఫిక్
ఆత్మకూరు: వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ శుక్రవారం తెల్లవారుజామున మున్సిపల్ పరిధిలోని నరసాపురం సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆ మార్గంలో సుమారు 3 గంటలసేపు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ జి.గంగాధర్, ఎస్సై జిలానీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్యాంకర్‌ను భారీ క్రేన్ ద్వారా తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ట్యాంకర్‌లో ఉన్నవారు గాయాల్లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
ఆస్పత్రికి వెళ్లాలంటే బురద తొక్కాల్సిందే..
సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. మార్గమంతా బురదమయంగా ఉండటంతో రోగులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. అలాగే ప్రహరీ లేదు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉద్యోగం పేరుతో మోసం


