పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కలిగిరి: మండల కేంద్రమైన కలిగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏపినాపి గ్రామానికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌కు ఎనిదేళ్ల క్రితం సరితతో వివాహమైంది. వారికి ఒక కుమార్తె ఉంది. విష్ణువర్ధన్ అనకాపల్లిలో ఇటుకబట్టీల వద్ద పని చేస్తున్నాడు. అక్కడ ధనలక్ష్మి అనే మహిళ పనిచేసేది. ఆమె భర్త నుంచి విడిపోయింది. విష్ణు, ఆమెకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ధనలక్ష్మిని తీసుకుని విష్ణు ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్లాడు. కాగా అనకాపల్లిలో ధనలక్ష్మి అదృశ్యంపై కేసు నమోదైంది. భర్త కనిపించడం లేదని సరిత ఫిర్యాదుతో కలిగిరి పోలీసులు విచారణ చేసి పామూరులోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. వారిని కలిగిరికి తీసుకొచ్చారు. అనకాపల్లి నుంచి వచ్చిన పోలీసులు ధనలక్ష్మిని వాహనంలో తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రియురాలిని తన నుంచి దూరం చేస్తున్నారంటూ విష్ణు ఫర్టిలైజర్ దుకాణం నుంచి పురుగు మందు తీసుకొచ్చి రోడ్డుపై తాగాడు. వెంటనే సరిత, ఇతర కుటుంబ సభ్యులు అతడిని కలిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం విష్ణు పరిస్థితి నిలకడగా ఉంది.


