తీవ్రంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత
● కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న వైనం
● ీ పజీలో రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి
● ఆయా కోర్సుల్లో భారీగా మిగిలిన సీట్లు
● ఆశంతా స్పాట్ అడ్మిషన్లపైనే
● వసతుల కల్పనా అంతంతమాత్రమే
● న్యాక్ ఏ గ్రేడ్‌ను నిలబెట్టుకుంటారాననేదీ అనుమానమే
జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన వర్సిటీని దివంగత సీఎం వైఎస్సార్ సాకారం చేశారు. ఇతర యూనివర్సిటీలకు వెళ్లకుండా ఇక్కడే ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే బృహత్తర ఆశయంతో విక్రమ సింహపురి వర్సిటీకి శ్రీకారం చుట్టారు. అయితే ప్రస్తుత పాలకులు దీనికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. వారు అనుసరిస్తున్న తీరు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం
కొలువుదీరి ఏడాదిన్నర దాటినా నేటికీ ఒక్క ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించలేదంటేనే వారికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. అధ్యాపకుల కొరత.. అంతంతమాత్రంగా మారిన వసతుల కల్పన.. వెరసి సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో అంతా అయోమయం నెలకొంటోంది.
● వాస్తవానికి వీఎస్‌యూలో పీజీలో ఎంఏ ఇంగ్లిష్.. తెలుగు.. పొలిటికల్ సైన్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.. ఎంకాం మాస్టర్ ఆఫ్ కామర్స్ / బ్యాంకింగ్ ఫైనాన్స్.. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్.. ఎమ్మెస్సీ మైరెన్ బయాలజీ.. బయోటెక్నాలజీ.. మైక్రో బయాలజీ.. ఆర్గనిక్ కెమిస్ట్రీ.. అనలిటికల్ కెమిస్ట్రీ.. ఫుడ్ టెక్నాలజీ.. ఫిజిక్స్.. స్టాటిస్టిక్స్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్.. ఎమ్మెస్సీ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ టెక్నాలజీ తదితర 15 కోర్సులున్నాయి. ఇందులో 673 సీట్లుండగా, రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం 199 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 474 మిగిలే ఉన్నాయి.
● ఐసెట్‌కు సంబంధించి ఎంసీఏ, ఎంబీఏ, టీఎంఎం, ఎమ్మెల్‌ఎస్ కోర్సులకు గానూ 181 సీట్లుంటే, 107 మాత్రమే భర్తీ అయ్యాయి.
● డిగ్రీలోని ఏడు కోర్సుల్లో 341 సీట్లకు గానూ 207 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ తరుణంలో స్పాట్ అడ్మిషన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ ప్రక్రియపై ఉన్నత విద్యా మండలి నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
నెల్లూరు(టౌన్): వీఎస్‌యూ నిర్వహణ అంతా లోపభూయిష్టంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అనేక భవనాల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు భారీగానే జరిగాయి. అయితే ప్రస్తుతమంతా గందరగోళం నెలకొంటోంది.
ఇదీ తీరు..
వర్సిటీలో అభివృద్ధి పనులు, పాలన వ్యవహారాలకు శ్రీకారం చుట్టాలన్నా, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర దాటినా నేటికీ అతీగతీ లేదు. గతంలో వర్సిటీని న్యాక్ బృందం సందర్శించి.. వసతుల పరిశీలన అనంతరం న్యాక్ ఏ గ్రేడ్‌కు సిఫార్సు చేయడంతో అది లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కొనసాగుతుందాననే అనుమానం నెలకొంది.
నిబంధనలు తుంగలో..
మైరెన్ బయాలజీలో మాత్రం స్పాట్ అడ్మిషన్ల కింద విద్యార్థులను చేర్చుకొని తరగతులను నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్‌గా ఉన్న వ్యక్తి.. మిగిలిన కోర్సులను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా తన సొంత డిపార్ట్‌మెంట్‌లో ఇలా నిర్వహిస్తుండటంపై మిగిలిన విభాగాల అధిపతులు గుర్రుగా ఉన్నారు. వీసీ సైతం ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.
అంతా ఆర్భాటం.. లోపలంతా అయోమయం
మరోవైపు వర్సిటీలో నెలకొన్న సమస్యలతో విద్యార్థులతో పాటు అధ్యాపకులకూ ఇక్కట్లు తప్పడంలేదు. ఇక్కడ వైఫై ఉన్నా, ఏ పత్రికా ఓపెన్ కావడంలేదు. ఇక్కడ స్టూడెంట్స్‌కు ఒక కల్చరల్ క్లబ్ సైతం లేదు. అంబులెన్స్ సౌకర్యమున్నా, పారామెడికల్ ఉద్యోగి కానరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను ఉదయం ఆరు తర్వాతే వర్సిటీలోకి అనుమతిస్తున్నారు. ఫలితంగా జాతీయ రహదారిపై దిగాక, బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది.
భారీగా మిగిలిపోయాయి..
ఎగ్జిక్యూటివ్ సమావేశ
ఏర్పాటుకు అనుమతి రాలేదు
వర్సిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు. చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఉన్నత విద్యామండలి నుంచి ప్రకటన వచ్చాక అన్ని డిపార్ట్‌మెంట్లలో స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహించడం లేదు.
– అల్లం శ్రీనివాసరావు, వీసీ,
వీఎస్‌యూ
తీవ్రంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత


