అందని సాయం..నేతన్నల ఆవేదన
పొదలకూరు: మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో నేతన్నలు బాగా నష్టపోయారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరి సుమారు 20 రోజులుగా నేయడం మానేశారు. జిల్లాలో 3 వేల మగ్గాలున్నాయని చేనేత, జౌళి శాఖ అధికారుల వద్ద అంచనాలతో కూడిన లెక్క మాత్రమే ఉంది. వీరిలో తుఫాను సాయం 1,800 మందికే అందినట్టు కార్మిక నాయకులు చెబుతున్నారు.
సంబంధిత అధికారులు సక్రమంగా ఎన్యుమరేషన్ చేపట్టలేదని వారి వల్లే తాము నష్టపోతున్నట్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పొదలకూరు, కోవూరు, నెల్లూరు రూరల్, వింజమూరు, ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం తదితర మండలాల్లో మగ్గం నేసే కార్మికులున్నారు.
పట్టించుకోకుండా..
నష్టపోయిన కార్మికులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సంబంధిత శాఖ మంత్రి ప్రకటించారు. ఎన్యుమరేషన్లో గుర్తించిన వారికి 50 కిలోల బియ్యం, కందిపప్పు, చక్కెర తదితరాలు కిలో చొప్పున అందజేశారు. ఇది కూడా అందలేదని కొందరు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.15 వేలు అందజేయాలని చేనేత ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం రూ.5 వేలు పంపిణీ చేస్తామని ప్రకటించి తీరా పట్టించుకోవడం లేదంటున్నారు.
అసలే లేవని..
పొదలకూరు పట్టణం కేఆర్‌ఆర్ నగర్లో 26 మగ్గాలుంటే సర్వేలో అసలు లేవని నివేదిక ఇవ్వడంతో ఒక్కరికి కూడా సాయం అందలేదని నేతన్నలు చెబుతున్నారు. కరెంట్ మీటర్లను ప్రామాణికంగా తీసుకుని సర్వే నిర్వహించడంతోనే అర్హులు అనర్హులుగా మిగిలిపోయారంటున్నారు. గత ప్రభుత్వం తయారు చేసిన నేతన్న నేస్తం పథకం జాబితా ఆధారంగా సర్వే నిర్వహించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనేది వారు చెబుతున్న మాట.
మోంథా తుఫానుతో తీవ్ర నష్టం రూ.5 వేల సాయం హామీ హుళక్కే బియ్యం, కందిపప్పు మాత్రమే పంపిణీ అదీ అందరికీ అందలేదని ఆందోళన జిల్లాలో 3 వేల మగ్గాలుంటే 1,800 మందికే..


