విద్యార్థిని మృతిపై విచారణకు వినతి
నెల్లూరు(దర్గామిట్ట): మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన విద్యార్థిని మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీపీఐ నాయకులు శుక్రవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు దామా అంకయ్య మాట్లాడుతూ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పాఠశాల అధికారులు తెలిపినా, ఘటనకు సంబంధించిన వివరాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయన్నారు. యాజమాన్యం తల్లిదండ్రులకు అందించిన సమాచారం అస్పష్టంగా ఉండటం సందేహాలను పెంచుతోందన్నారు. పురుష డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించారని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారన్నారు. భద్రతపై ఆందోళన చెందుతున్న పేరెంట్స్ తమ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్లిపోతున్నారన్నారు. ప్రభుత్వం మేల్కొని ఇటువంటి మరణాలు జరగకుండా విచారణ జరిపాలన్నారు. కార్యక్రమంలో నాయకులు యామాల మధు, సిరాజ్, ముక్తియర్, షాజహాన్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


