ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
● డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
నెల్లూరు(క్రైమ్): ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాల నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. బస్సుల పర్మిట్, ఎఫ్‌సీ, ఫైర్ ఎక్విప్‌మెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఎగ్జిట్ డోర్స్ వద్ద సీట్లను ఏర్పాటు చేశారా? ఇలా అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తు తదితరాలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయని, డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నెల్లూరులోని వివిధ కూడళ్లలో సౌత్, నార్త్ ట్రాఫిక్ పోలీసులు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. బస్సుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ బస్సుల యాజమాన్యాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లేకపోతే బస్సులపై కేసులు నమోదు చేస్తామన్నారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు


