నామమాత్ర వినియోగం.. ప్రయోజనం శూన్యం
నగరపాలక సంస్థ అధికారులు రోడ్లను ఊడ్చే పేరుతో ఖజానాను ఊడ్చేస్తున్నారు. వందలాది మంది పారిశుధ్య కార్మికుల కడుపులు కొట్టి.. రోడ్లను పరిశుభ్రం చేసేందుకు స్వీపింగ్ యంత్రాలు తెచ్చారు. ఎండా కాలంలో తప్ప.. వానాకాలం, శీతాకాలంలో మూలన పడేసే వాహనాలకు రూ.కోట్లు ఖర్చు పెట్టారు. వీటి నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నెల నెలా రూ.కోటి దోచిపెడుతున్నారు. అదే కార్పొరేషన్ నిర్వహిస్తే ఇంత స్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదనే వాదన వినిపిస్తోంది. కార్పొరేషన్‌లో ఎంతో మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు.. వీరికి జీతాలిస్తోంది. అదే ఈ డ్రైవర్లతో ఈ వాహనాలను నడిపించడం వల్ల ఖర్చు ఉండదు. ఇక డీజిల్, మెయింటెనెన్స్ రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అయినా ఇంత ఖర్చు పెట్టినా రోడ్లు దుమ్ముకొట్టుకుంటునే ఉండడం గమనార్హం.
కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నిలిచి ఉన్న స్వీపింగ్ యంత్ర వాహనాలు
నెల్లూరు (బారకాసు): నగర పాలక సంస్థ పరిధిలో రోడ్ల పరిశుభ్రత పేరుతో రూ.కోట్ల ప్రజాధనం లూటీ అవుతోంది. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక అధికారులు స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్ 50 శాతం, నెల్లూరు నగర పాలక సంస్థ 50 శాతం నిధులు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేసి మొత్తం 27 స్వీపింగ్ యంత్ర వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క వాహనం రకాన్ని బట్టి రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. ఇందులో 6 క్యూబిక్ మీటర్స్ కెపాసిటీ–4, 5 క్యూబిక్ మీటర్–1, 4 క్యూబిక్ మీటర్–1, 3 క్యూబిక్ మీటర్స్–14, 1 క్యూబిక్ మీటర్–5, 1 క్యూబిక్ మీటర్ (బ్యాటరీ)–2 చొప్పున ఉన్నాయి. వీటిని టీపీఎస్ కంపెనీ సరఫరా చేసింది. వీటి వల్ల కార్పొరేషన్‌పై నెలకు సుమారుగా రూ.కోటి ఆర్థిక భారం పడుతోంది. అయినా.. వీటి వల్ల రూపాయి ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది.
పని తక్కువ.. ఖర్చు ఎక్కువ
ఈ స్వీపింగ్ యంత్ర వాహనాలు కేవలం ఎండా కాలంలో తప్ప.. వర్షాకాలం, శీతాకాలంలో వినియోగించే అవకాశం లేదు. ఎందుకంటే నీళ్లు.. మంచు వల్ల మట్టి రోడ్లకు అతుక్కుని పోవడం వల్ల పరిశుభ్రం అయ్యే అవకాశం లేదని సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగులే చెబుతున్నారు. చివరకు పారిశుధ్య కార్మికులే మళ్లీ ఈ రోడ్లను శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉంది. ఐదారు నెలల పాటు ఉండే ఎండాకాలంలో వినియోగించే వీటి కొనుగోలు కోసం దాదాపు రూ.25 కోట్ల ఖర్చు పెట్టారు. అయితే వీటిని టీపీఎస్, రాజరాజేశ్వరి రెండు కంపెనీలు మెయింటెనెన్స్ చేస్తుంటాయి. ఆయా వాహనాలకు డ్రైవర్లు, ఆయిల్, స్పేర్ పార్ట్స్, స్వీపింగ్ బ్రెష్‌లు మార్చుకోవడం, మరమ్మతులు మొత్తం కంపెనీలే భరించాల్సి ఉంది. పెద్ద వాహనానికి గంటకు రూ.1500, చిన్న వాహనానికి రూ.వెయ్యి చొప్పున ఎన్‌ఎంసీ చెల్లిస్తోంది. ఒక్కొక్క వాహనం రోజుకు 8 గంటల పాటే పనిచేయాల్సి ఉంది. ఇలా మొత్తంగా నెలకు రూ.90లక్షల వరకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఏ వాహనం ఎక్కడ పని చేస్తుంది.. ఎంత సేపు చేసింది వంటి వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఎన్‌ఎంసీలోని ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్వీపింగ్ వాహనాలున్నప్పటికీ వీటిని వినియోగ పర్యవేక్షణ మాత్రం శానిటరీ విభాగ మేసీ్త్రలతో పాటు ఆయా ప్రాంతాలకు సంబంధించిన సచివాలయ శానిటరి సెక్రటరీలు చూసుకుంటూ ఉంటుంటారు. అయినప్పటికీ ఆయా స్వీపింగ్ వాహనాలు మొక్కుబడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనవసరంగా ఖర్చు ఎక్కువ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా.. మరో నూతన స్వీపింగ్ వాహనం అవసరమని కార్పొరేషన్ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించే పనిలో ఉండడం కొసమెరుపు.
పారిశుధ్య కార్మికులకు
నెలకు రూ.3 కోట్ల ఖర్చు
నగర పాలక సంస్థలో ప్రధాన మార్గాల్లో రోడ్లపై ఏర్పడే ఇసుక, దుమ్మును శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు 1400 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 250 మంది రెగ్యులర్ కాగా, మిగిలిన 1,150 మంది ఔట్‌సోర్సింగ్ (ఆప్కాస్) ద్వారా విధుల్లో ఉన్నారు. వీరికి నెలకు దాదాపు రూ.3 కోట్లకు పైగా జీతాలుగా చెల్లిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల వల్ల కార్పొరేషన్‌పై ఆర్థిక భారం పడుతుందంటూ గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ విభాగాన్ని దాదాపుగా ప్రైవేటీకరణ చేసి, కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా నిర్వహణ చేపట్టింది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, వీరిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే విధంగా ఆప్కాస్ కిందకు తీసుకువచ్చింది. కేవలం ఐదారు నెలలు పని చేసే స్వీపింగ్ వాహనాలకు రూ.కోట్లు ఖర్చు చేసే బదులు నిరంతరం పనిచేసే పారిశుధ్య కార్మికులు మరికొంత మందిని నియమించుకుంటే తద్వారా అనేక మందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు రోడ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రూ.25 కోట్లతో 27 స్వీపింగ్ యంత్రాల కొనుగోలు
ప్రజాధనం దోచుకునేందుకు
నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల అప్పగింత
మెషీన్లు ఇచ్చి.. ప్రతి నెలా
రూ.90 లక్షలు చెల్లింపు
ఎండా కాలంలోనే వీటి వినియోగం
కార్పొరేషన్‌పై ఆర్థికంగా పెనుభారం
అయినా రోడ్ల శుభ్రత, వాహనాల వినియోగం తూతూమాత్రం
నగరంలోని రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా స్వీపింగ్ మెషీన్ల వాహనాలను వినియోగిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులైన మినీబైపాస్‌రోడ్డు, జీఎన్‌టీ రోడ్డుల్లో పెద్ద వాహనాలను, ప్రధాన వీధులైన సిమెంట్ రోడ్లలో చిన్న వాహనాలతో రోడ్ల శుభ్రతను చేపడుతున్నారు. అయితే వీటి వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుమ్ము ఉన్న చోట కాకుండా పరిశుభ్రంగా ఉన్న సిమెంట్ రోడ్డులో చిన్న స్వీపింగ్ వాహనాలు నడుపుతూ షో చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో అయితే పెద్ద స్వీపింగ్ వాహనాలను రెండు గంటల పాటు వినియోగించి రోడ్డు పక్కనే పెట్టేసి నిద్రపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నామమాత్ర వినియోగం.. ప్రయోజనం శూన్యం


