దోచుకున్న ప్రజాధనాన్ని కక్కిస్తాం
● రైతులు పనులు చేస్తే టీడీపీ నేతలు బిల్లులు చేసుకోవడం దుర్మార్గం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల్లో టీడీపీ నాయకులు దోచుకున్న ప్రజాధనాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి కక్కిసామని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలో సర్వేపల్లిలోకి వచ్చిన ఆయన వ్యవసాయంపై రైతులతో చర్చించారు. కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి రైతులను అడ్డం పెట్టుకుని ఇరిగేషన్ పనుల్లో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు. పంటల సాగు సమయం వచ్చినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు చందాలు వేసుకుని కాలువ పనులు చేస్తే, అవే పనులకు టీడీపీ నాయకులు బిల్లులు చేసుకోవడం దుర్మార్గమన్నారు. కొన్ని చోట్ల మొక్కుబడిగా చేసి, కొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే దొంగ బిల్లులను చేసుకోవడంతో రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. సర్వేపల్లిలో మంజూరైన, చేసిన పనులకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే, ఎక్కడ ఇరుక్కుంటామోనని అధికారులు బయపడి వివరాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సోమిరెడ్డితోపాటు, బిల్లులు చేసిన ఇరిగేషన్ ఇంజినీర్లు, ఇరిగేషన్ కార్యాలయంలో పని చేసే మేనేజర్లు కుమ్ముౖక్కై వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎవరెవరి నంబర్లకు లంచాలు ఫోన్‌పే ద్వారా పంపించారో, ఆ నంబర్లు, వివరాలు సేకరించామని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి ప్రజల సొమ్ము దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ ని తెలియజేశారు. వరి నాట్లు ప్రారంభమైనా రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో, రైతులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులను అన్నీ విధాలా ఆదుకుంటే, చంద్రబాబు పాలనలో రైతులను అంటరాని వాళ్లలాగా చూస్తున్నారన్నారు. తాము అధికారంలో లేకపోయినా సర్వేపల్లిలో రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందించేందుకు పోరాడుతామని తెలియజేశారు. తొలుత ఆయన మండలంలోని సర్వేపల్లికి చెందిన చిట్టమూరు సుధాకర్‌రెడ్డి సతీమణి లీలావతమ్మ మృతి చెందడంతో శుక్రవారం ఆమె పార్థివ దేహానికి కాకాణి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట విజయ డెయిరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, నాయకులు ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


