నిరంతర ప్రక్రియగా ఓటర్ల జాబితా నవీకరణ
నెల్లూరు (దర్గామిట్ట): ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2002 నుంచి 2005 మధ్యలో నమోదైన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కూడా చేపట్టినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఫారం–6లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు. ఫారం 7, 8పై ప్రత్యేక దృష్టి పెట్టి నమోదు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ప్రధాన లక్ష్యమన్న కలెక్టర్, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఓటరు జాబితా నవీకరణ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. ఇందు కోసం రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. త్వరలోనే వీరికి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ విజయకుమార్, వెంకట శేషయ్య (వైఎస్సార్‌సీపీ), రసూల్ (టీడీపీ) శ్రీనివాస్ (బీజేపీ), శ్రీరామ్ (బీఎస్పీ), బాలసుధాకర్ (కాంగ్రెస్) తదితరులు హాజరయ్యారు.


