ఎమ్మెల్యే కాకర్ల అనుచరుల ఇష్టారాజ్యం
● డ్రైనేజీ ధ్వంసం
కలిగిరి: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. కలిగిరిలో నేషనల్ హైవే 167 బీజీ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న డ్రైనేజీని సురేష్ అనుచరులు గురువారం అర్ధరాత్రి దగ్గరుండి జేసీబీతో ధ్వంసం చేయించడం చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం మేరకు.. తహసీల్దార్ కార్యాలయం నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు జరుగుతున్న హైవే విస్తరణ, డ్రైనేజీ పనులను గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పరిశీలించి కొలతలు తీయించారు. కొంత ప్రాంతంలో 82 అడుగులు, మరికొంత ప్రాంతంలో 62 అడుగుల్లో పనులు జరుగుతుండటంతో నిలిపేయాలని ఆదేశించారు. కలిగిరి మొత్తం 82 అడుగుల్లో ఒకేసారి పనులు చేపట్టాలన్నారు. విస్తరణకు అనుమతి లేదని, డ్రైనేజీ నిర్మాణం వరకే ఉందని హైవే అధికారులు చెప్పారు.
పనుల కొనసాగింపు
ఎమ్మెల్యే వెళ్లిపోయిన అనంతరం కొంతమేర తారురోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. కలిపిన తారు, కంకర మిశ్రమం వృథా అవుతుందని పనులు కొనసాగించామని సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. ఈ విషయాన్ని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గురువారం రాత్రి సమయంలో జేసీబీతో కొంతమంది నాయకులు దగ్గరుండి సుమారు 40 మీటర్ల డ్రైనేజీ నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. ఇలా చేయడం సరికాదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
ఎమ్మెల్యే కాకర్ల అనుచరుల ఇష్టారాజ్యం


