
శిక్షణ, ఉద్యోగావకాశాలు
నెల్లూరు (పొగతోట): డీఆర్‌డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగు యువతకు వివిద రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రటకనలో తెలిపారు. బోగోలు, కోవూరులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్, ఫీల్డ్ టెక్నీషియన్, సర్వీస్ ఇంజినీర్, ఐటీ హార్డ్‌వేర్ తదితర వాటిపై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఇంటర్ పాస్, డిగ్రీ చదివిన నిరుద్యోగులైన యువతి, యువకులు డీఆర్‌డిఏ కార్యాలయంలోని జాబ్స్ విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9493513896, 9553491047, 9032693233 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
ఎన్‌ఎల్‌ఆర్ 3648 నూతన వరి రకం
నెల్లూరు (పొగతోట): ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (వ్యవసాయ పరిశోధన క్షేత్రం)లో ఎన్‌ఎల్‌ఆర్ 3648 నూతన వరి రకం విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. పరిశోధన క్షేత్రంలో వరి పంటను రైతులకు శుక్రవారం పరిచయం చేశారు. పరిశోధన క్షేత్రం అధికారులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ రకం వరి వంగడం అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని అధిక దిగుబడులను ఇస్తుందని తెలిపారు. ఈ వరి దిగుబడులపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లాలోని రైతులందరికీ ఎన్‌ఎల్‌ఆర్ 3648 రకం విత్తనాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధన క్షేత్రం అధికారి వినిత, రైతులు పాల్గొన్నారు.
18 బార్లకు
దరఖాస్తుల దాఖలు
నెల్లూరు (క్రైమ్): బార్లకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రభుత్వం గడువు పెంచినప్పటికీ వ్యాపారుల స్పందన నామ మాత్రంగానే ఉంది. జిల్లాలోని ఓపెన్ కేటగిరీలో 50, గౌడ కులాలకు 5 బార్లకు సంబంధించి శుక్రవారంతో గడువు ముగిసింది. 55 బార్లకు 18 బార్లకు మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే గడువు ముగిసే సమయానికి కొందరు ఆఫ్ లైన్‌లో దరఖాస్తులు వేసేందుకు క్యూలైన్లలో ఉండడంతో వారి నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. నెల్లూరు నగరంలో 38 బార్లకు 10, కావలిలో రెండు బార్లకు, కందుకూరులో మూడు బార్లకు దరఖాస్తులు అందాయి. గీత కులాలకు సంబంధించి నెల్లూరు నగరంలోని రెండు బార్లకు, కావలిలో ఒక బారుకు దరఖాస్తులు అందాయి. కందుకూరులోని ఒక బారుకు మూడు దరఖాస్తులు, అల్లూరులోని ఒక బారుకు ఒక దరఖాస్తు మాత్రమే అందాయి. అయితే ఒక్కో బారుకు నాలుగు దరఖాస్తులు అందాలనీ, ఒక్కరే నాలుగు దరఖాస్తులు వేయకూడదనే నిబంధన ఉండడంతో 18 బార్లకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. శనివారం నగరంలోని న్యూ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో డ్రా నిర్వహించనున్నారు.
పింఛన్ బాధితులు దరఖాస్తులు చేసుకోండి
నెల్లూరు(పొగతోట): పింఛన్లు తొలగించిన దివ్యాంగులు ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వైద్యాధికారులు అంగవైకల్యాన్ని పరిశీలించి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. వాటి ఆధారంగా దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయడం, మార్పులు చేయడం జరిగిందన్నారు. రద్దు చేసిన, మార్పులు చేసిన పింఛన్ల లబ్ధిదారులు అర్హులని భావిస్తే ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పాత పింఛన్ కార్డు, సర్టిఫికెట్లు, బయోమెట్రిక్ ద్వారా అందుకున్న నోటీసు, ఆధార్ కార్డుతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పునః పరిశీలించి చర్యలు చేపడుతామన్నారు.
పోలీసుల అదుపులో
నిందితులు?
నెల్లూరు (క్రైమ్): నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని చంపేస్తే డబ్బేడబ్బుని కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు. వీడియో తీసిన సమయంలో అక్కడ ఎనిమిది మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిలో రౌడీషీటర్ జగదీష్ ఇప్పటికే జైల్లో ఉండగా మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీడియో తీసిన సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం మాట్లాడుకున్నారు? ఇలా అన్నీ కోణాల్లో లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది.