
చవితి వేడుకల్లో అపశ్రుతి
● బాణసంచా ప్రమాదంలో
పదిమందికి గాయాలు
ఉదయగిరి: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అప్పసముద్రం, నడింపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను మూడోరోజైన శుక్రవారం నిమజ్జనం కోసం తరలించారు. అప్పసముద్రంలో రెండు విగ్రహ ఊరేగింపులు ఒక ప్రదేశానికి చేరుకున్నాయి. నడింపల్లి ఊరేగింపులో మద్యం తాగిన వ్యక్తి బాణసంచా కాల్చే క్రమంలో నిప్పురవ్వలు అప్పసముద్రం ఊరేగింపు వాహనంలో పడ్డాయి. అందులో ఉన్న బాణసంచా పేలింది. దీంతో పదిమంది బాలబాలికలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే దుత్తలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం వింజమూరులోని వైద్యశాలకు తరలించారు. ఐదుగురు ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతున్నారు. మరో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.