
తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత
● మాజీ ఉపరాష్ట్రపతి
వెంకయ్యనాయుడు
● సింహపురిలో తెలుగు
భాషోత్సవాలు ప్రారంభం
నెల్లూరు(బృందావనం): తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా సేవ తెలుగుభాష, సాహితి, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే తెలుగుభాషోత్సవాలను శుక్రవారం నెల్లూరు పురమందిరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ చూపిన గిడుగువారు తెలుగువారందరికీ ఆదర్శనీయులన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మాతృభాష పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. తిక్కన మహాకవి మొదలుకుని తన గురువు పోలూరు హనుమజ్జానకీరామ శర్మ వరకు ఎందరో మహనీయులు తెలుగు సాహిత్య సేద్యం చేశారన్నారు. తెలుగు మన చిరునామా అన్నారు. మన జీవితాలకు వెలుగునిచ్చేది మాతృభాషేనన్నారు.
● ప్రసార భారతి విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు అధ్యక్షతన జరిగిన తొలిరోజు సభలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం) విశ్రాంత ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్లం శ్రీనివాసరావు, గిడుగు రామమూర్తి పంతులు వారసులు, పెద్దకోడలు గిడుగు సరస్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వ్యాఖ్యాతలుగా డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ శోభ కొణిదెల వ్యవహరించారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత సంస్థ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు స్వాగతోపన్యాసం చేశారు.
● మధ్యాహ్నం నిర్వహించిన ప్రాచీన సాహిత్య సదస్సుకు సభాధ్యక్షుడిగా తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వ్యవహరించారు. ప్రముఖ సాహితీవేత్తలు అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆచార్య పాపినేని శివశంకర్, ఆచార్య టి.గౌరీశంకర్, అల్లు భాస్కరరెడ్డి ప్రాచీన సాహిత్య విలువలను వివరించారు. కవి, విమర్శకులు డాక్టర్ పెరుగు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఆధునిక సాహిత్య సదస్సులో ఆచార్య శిఖామణి మాట్లాడారు. కందిమళ్ల సాంబశివరావు బాలనాటక రంగం ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ అధ్యక్షతన జరిగిన బాలసాహిత్య సదస్సులో విశిష్ట అతిథులుగా డాక్టర్ డీకే చదువులబాబు, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, చంద్రలత, డాక్టర్ కందేపి రాణీప్రసాద్, దార్ల బుజ్జిబాబు, టీవీ రామకృష్ణ పాల్గొన్నారు. కవితోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా బోర భారతీదేవి, డాక్టర్ శోభ కొణిదెల, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ కె.కరుణశ్రీ తదితరులు వ్యవహరించారు.