
అన్నదాతలపై కనికరం లేదా?
● కలెక్టరేట్ ఎదుట కౌలు రైతు సంఘం నిరసన
నెల్లూరు రూరల్: అన్నదాతలపై కనికరం లేదా అని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో 3.50 లక్షల ఎకరాల సాగు నీరిస్తామని చెప్పడంతో రైతులు వరి పంట వేశారన్నారు. ధాన్యం మార్కెట్లోకి రాబోతుండగా కొనుగోలు కేంద్రాల ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. మిల్లర్ల కోసమే ఈ ప్రభుత్వం, అధికారులు పనిచేస్తోందని ఆరోపించారు. ఇదే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు ముత్యాల గురునాథం, కార్యదర్శి తుళ్లూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.