
అధికారుల చుట్టూ తిరుగుతూ..
నెల్లూరు(టౌన్): డీఎస్సీ ఆరంభం నుంచి గందరగోళం నెలకొంది. కాల్‌లెటర్లు రాని అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో అభ్యర్థుల మార్కులను జిల్లా విద్యాశాఖ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచేవారు. అభ్యంతరాలు స్వీకరించి తుదిజాబితాను రూపొందించేవారు. ఆ తర్వాత జాబితా ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగేది. అయితే ఈసారి అంతా విరుద్ధంగా ఉంది. తొలినుంచి వ్యవహారమంతా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచే జరుగుతోంది. ఎంపికై న అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా కాల్‌లెటర్లు డౌన్‌లోడ్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఎవరికెన్ని మార్కులు వచ్చాయి?, రిజిర్వేషన్ కేటగిరీలో ఏ పోస్టులు పోయాయో తెలియని పరిస్థితి. పారదర్శకంగా చేయాల్సిన ప్రక్రియ గోప్యంగా చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మెరిట్ జాబితాలో పేరుండి కాల్‌లెటర్లు రాని అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయలేని స్థితిలో జిల్లా విద్యాశాఖాధికారులున్నారు. శుక్రవారం ఏడుగురు అభ్యర్థులకు మెసేజ్ రాలేదు. వివరాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాకు పంపించడంతో వారి సూచనలతో కాల్‌లెటర్లు డౌన్‌లోడ్ చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు.
ఎప్పుడొస్తాయో..
జిల్లాలో మొత్తం 673 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా 673 మందికి కాల్‌లెటర్లు పంపించాల్సి ఉంది. అయితే గురువారం నాటికి 585 మంది, అదేరోజు రాత్రి 56 మందికి పంపించారు. గురువారం 585 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా ఏడుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారు. శుక్రవారం 56 మందికి వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉండగా ఒకరు రాలేదు. మొత్తంగా రెండు రోజులకు కలిపి 641 మందికి కాల్‌లెటర్లు రాగా 633 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. 8 మంది గైర్హాజరయ్యారు. ఇంకా 32 మందికి కాల్‌లెటర్లు రాలేదు. ఎప్పుడొస్తాయో అనే దానిపై జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం లేదు. అయితే మెరిట్ లిస్టులో పేర్లు ఉండి దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. రోస్టర్ కమ్ రిజర్వేషన్‌పై కూడా అంతగా అవగాహన లేకపోవడంతో లెటర్లు అందని అభ్యర్థుల సందేహాలకు సమాధానం చెప్పే వారు కరవయ్యారు. ఇప్పుడు లెటర్ రాకపోతే ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
డీఎస్సీలో అంతా గందరగోళమే..
673 మందికి గానూ 641 మందికే కాల్‌లెటర్లు
ఎప్పుడు వస్తాయన్న దానిపై
సమాధానం కరువు
రాష్ట్ర స్థాయిలోనే రోస్టర్ కమ్ రిజర్వేషన్