
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పోలీసులు
● మా మాజీ ఎమ్మెల్యే ఇంటికి
వెళ్లడానికి ఎందుకీ ఆంక్షలు
● పార్టీ నేతలుగా ప్రతి కార్యకర్తకు ధైర్యం ఇవ్వడం మా బాధ్యత
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. వాస్తవాలతో సంబంధం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెబితే.. అది చేస్తున్నారంటూ విమర్శించారు. కావలిలోని తమ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడానికి ఎందుకీ ఆంక్షలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం వెళ్తున్న కాకాణితోపాటు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను నగరంలోని కాకాణి నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవినీతికి పాల్పడుతుంటే విమర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నవరంలో విచ్చలవిడిగా సహజ వనరులను కొల్లగొడుతుంటే ఆ ఫొటోలు తీసేందుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులను నిర్బంధించి వారిని భయపెట్టి బెదిరించి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని ఈ కేసులో జత చేశారన్నారు. హైకోర్టును ఆశ్రయించిన రామిరెడ్డికి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో నాపై ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారో ఆ విధానాన్నే రామిరెడ్డిపై అవలంబిస్తూ తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టారన్నారు. కావలిలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో మాట్లాడి ధైర్యమిచ్చామన్నారు. అయితే తనను, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని అభ్యంతరకరంగా మాటలు మాట్లాడారని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని, అవినీతి ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడం ఎన్నడూ చూడలేదని, ఇప్పుడు పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, రాజ్యాంగ విలువలు దిగజారి పోతున్నాయన్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వంటి సౌమ్యుడిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. ఎన్నికలు ఏ రోజు జరిగినా జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు జైళ్లకు, అక్రమ కేసులకు భయపడరని తెలిపారు. ఎంత మంది పోలీసులు వచ్చినా, మిలటరీ బలగాలను దింపినా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదన్నారు.