
అడవిలో సొరంగ మార్గానికి శ్రీకారం
● రూ.857.75 కోట్ల వ్యయంతో
టన్నెల్ పనులు
● గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నిర్మాణం
సీతారామపురం: విజయవాడ–బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతమైన మండలంలోని సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్‌రోడ్డు సమీపంలో మ్యాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ రూ.857.75 కోట్ల వ్యయంతో సొరంగ మార్గం (టన్నెల్) తవ్వకాల పనులకు శ్రీకారం చుట్టింది. ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా వాహనాలు వెళ్లేందుకు, వచ్చేందుకు వేరువేరుగా సొరంగ మార్గాలు నిర్మించనున్నారు. ఒక్కో సొరంగం 16.7 మీటర్ల వెడల్పు, 9.8 మీటర్ల ఎత్తుతో 3.68 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. సీతారామపురం అటవీ ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ సొరంగ మార్గం వైఎస్సార్ కడప జిల్లాలో తెరుచుకుంటుంది. ప్రస్తుతం ఒక సొరంగం మార్గానికి రెండు వైపులా తవ్వకం పనులు ప్రారంభమైనట్లు నిర్మాణ పనులు చేపట్టిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ బృందం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన పనులను 2027 ఫిబ్రవరిలోపు పూర్తి చేయడమే గాక 15 ఏళ్ల పాటు అదే కంపెనీ నిర్వహణ బాధ్యతలను చూడనుంది. సుమారు 520 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తున్న విజయవాడ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఈ టన్నెల్ తవ్వుతున్నారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేల్లో ఉన్న టన్నెల్స్‌లో ఇదే పొడవైనదిగా రికార్డులకెక్కుతుందని జాతీయ రహదారి సంస్థ అధికారులు అంటున్నారు.

అడవిలో సొరంగ మార్గానికి శ్రీకారం