
అరుణ వెనుక టీడీపీ గోతులు
కోవూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న జీవిత ఖైదీ శ్రీకాంత్, అతని స్నేహితురాలు నిడిగుంట అరుణ వ్యవహారం కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా పాట్లు పడుతోంది. వీరిద్దరి వెనుక టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న విషయం పెరోల్‌తో వెలుగు చూసిన విషయం విదితమే. అరుణ ఇటీవల సోషల్ మీడియాలో శ్రీకాంత్‌ను వాడుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండడంపై ప్రశ్నిస్తూనే అందరి బాగోతాలు బయట పెడుతానంటూ పెట్టిన పోస్టు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పోస్టు పెట్టిన మరుసటి రోజే అరుణను, ఆమె అనుచరులను ఎప్పటి కేసునో బయటకు తీసి హడావుడిగా అరెస్ట్ చేయడం, పోలీస్ కస్టడీ పేరుతో విచారణ చేపట్టడం తెలిసిందే. అరుణ కేసుతో తమకు సంబంధం లేదంటూనే.. మరో వైపు అరుణను విచారణ నిమిత్తం జిల్లా జైలు నుంచి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు, అనంతరం జిల్లా జైలుకు తరలిస్తున్న కారు (ఏపీ 40 డీటీ 3388) టీడీపీ స్థానిక నేత ఇంతా మల్లారెడ్డికి సంబంధించింది కావడం గుసగుసలకు తావిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆమె వెనుక టీడీపీ నేతలు ఉన్నారా? లేక ఆమె వెనుక గోతులు తవ్వుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత కారు వినియోగంపై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వకుండా మౌనం దాల్చుతున్నారు. టీడీపీ నేతలతో కలిసి పక్కా అవగాహనతోనే జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఈ వ్యవహారం నుంచి బయట పడటానికి మాత్రమే ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు విచారణలో పారదర్శకత చూపకుండా, కథలు చెప్పడంపై ప్రజల్లో అనుమానాలకు మరింత బలం చేకూరుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆమె వ్యవహారం ఆ పార్టీ మెడకు
చుట్టుకున్న వైనం
తమకు సంబంధం లేదంటూ హడావుడి అరెస్ట్‌లు, పోలీస్ కస్టడీ విచారణలు
టీడీపీ నేత వాహనంలోనే ఆమె
తరలింపు