
పోలీసుల అత్యుత్సాహం
● ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్దకు
ఎవరినీ వెళ్లకుండా అడ్డగింత
● కావలికి వచ్చే అన్నిదారుల్లో పోలీసుల మోహరింపు, వాహనాల తనిఖీ
కావలి (జలదంకి): కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నెల్లూరు నుంచి మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు కావలికి వస్తున్నట్లు సమాచారం ఉండడంతో పోలీసులు అత్యుత్సాహం చూపి మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటికి వచ్చే అన్ని దారుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కావలిలోని బృందావనం వద్ద, ముసునూరు టోల్‌ప్లాజా, బైపాస్ క్రాస్‌రోడ్డు, ముసునూరు లింక్ రోడ్డుతోపాటు ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం వద్ద ఎస్సైలు సుమన్, బాజీబాబు, తిరుమలరెడ్డితోపాటు పోలీసులు వెళ్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మా నాయకుడి ఇంటికి కూడా వెళ్లకూడదా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కావలిలో ప్రజాస్వామ్యం ఉందా లేక కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతుల్లో ఉందా అంటూ పోలీసులను నిలదీయడంతో పైఅధికారుల ఆదేశాలంటూ సమాధానమిచ్చారు.