
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిపై స్కెచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. హత్యా రాజకీయాలు మేము ప్రోత్సహించం. శ్రీధర్ రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్ జగన్. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పనులు చేయకూడదు. నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కోటంరెడ్డి. నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి కాదా!. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నెల్లూరులో రౌడీ కల్చర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డి. పెరోల్‌పై హోంమంత్రి సంతకం పెట్టింది నిజం కాదా?. ఏం తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ సంతకం చేశారు. పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా?.
నేడు నీపై హత్యాయత్నం ప్లాన్ చేసిన వ్యక్తులు నీ అనుచరులు కాదా!. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా వదిలిపెట్టలేదు. నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోమన్నారు జగన్. నేడు సంబంధం లేని వ్యక్తులపై కక్ష్య సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పోలీసులు వైఫల్యం చెందారు. నెల్లూరు ఎస్పీ అసమర్థుడు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలు విషయాలపై సీబీఐ విచారణ వేయాలి. శ్రీధర్ రెడ్డి నీ ప్రవర్తన సరికాదు. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.

మరోవైపు.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రైతాంగానికి యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబుది. రైతు ప్రయోజనాలు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ఇది. దళారీలు, వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఉల్లి రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. అన్నదాతా సుఖీభవా పేరుకే పరిమితం అయింది. ఒకటిన్నర ఏడాది తరువాత ఉచిత బస్సు పెట్టి మహిళలు లక్షాధికారులు అయిపోతారు అనడం సిగ్గు చేటు. చంద్రబాబు ఏనాడు అధికారంలోకి వచ్చినా రైతులకు చీకటి రోజులే అనుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు పారదర్శకమైన లబ్ధి పొందారు. వైఎస్సార్‌సీపీ రైతాంగానికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తుంది. అండగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు.