
గంజాయి విక్రయాలపై దాడులు
● నలుగురి అరెస్ట్
● 6 కేజీల గంజాయి, ఆటో, నగదు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయాలపై నెల్లూరు సంతపేట పోలీసులు దాడులు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. సోమవారం సంతపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ జి.దశరథరామారావు వివరాలను వెల్లడించారు. కపాడిపాళెం రాయపువారి వీధికి చెందిన షేక్ సుభానీ, షేక్ సిరాజ్ దంపతులు కొంతకాలంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. 2023 మే నెలలో పోలీసులు సుభానీపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆమె భర్తపై సుమారు ఎనిమిది కేసులున్నాయి. అయినా వారు మారలేదు. విశాఖ ఏజెన్సీ నుంచి కేజీ గంజాయి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి నెల్లూరుకు తీసుకొస్తున్నారు. వాటిని 5, 10 గ్రాముల ప్యాకెట్లుగా చేసి రూ.150, రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. కొందరికి హోల్‌సేల్‌గా సైతం అమ్ముతున్నారు. వీరి కదలికలపై సంతపేట పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం ఇన్‌స్పెక్టర్‌కు అందింది. ఆయన పర్యవేక్షణలో ఎస్సైలు బాలకృష్ణ, సుల్తాన్‌బాషా తమ సిబ్బందితో కలిసి వారి ఇంటివద్ద దాడులు చేశారు. దంపతులిద్దరితోపాటు గంజాయిని విక్రయాలకు తరలిస్తున్న అదే ప్రాంతానికి చెందిన కె.జ్యోతి, నెల్లూరు రూరల్ మండం కోడూరుపాడు గ్రామం కల్తీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ మీరాను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 6.350 కేజీల గంజాయి, రూ.22,500 నగదు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా నెల్లూరు నగరంలో విక్రయాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించడంతో అరెస్ట్ చేశారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం గంజాయి విక్రయిస్తున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్, ఎస్సైలు, సిబ్బంది జి.శ్రీహరి, జి.సుబ్బారావు, షేక్ అల్లాభక్షు, ఎస్.సురేంద్రబాబు, గోపీ, శ్రీకాంత్, పి.కుమారి, సీహెచ్ అనూషను ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు.