
మమ్మల్ని అడిగేదెవరు..!
● ఆరాధనోత్సవాల చివరిరోజు
విచ్చలవిడిగా డైమండ్ డబ్బా నిర్వహణ
● యథేచ్ఛగా మద్యం విక్రయాలు
వెంకటాచలం: మండలంలోని గొలగమూడి గ్రామంలో భగవాన్ శ్రీవెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో చివరిరోజు విచ్చలవిడిగా డైమండ్ డబ్బా (జూదం) నిర్వహించారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఆశ్రమానికి కూతవేటు దూరంలో, తిక్కవరప్పాడు వెళ్లే రోడ్డు పక్కన కొందరు డైమండ్ డబ్బా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున వరకు ఇది కొనసాగింది. నిర్వాహకులు భక్తుల నుంచి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఏటా నిర్వహించే ఆరాధనోత్సవాల సందర్భంగా గొలగమూడిలో డైమండ్ డబ్బా నిర్వహించకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టేవారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించేవారు. కానీ ఈసారి పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.
మద్యం అమ్మకాలు
ఆరాధనోత్సవాలకు వచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని గొలగమూడి గ్రామ నలుదిక్కులా మద్యం విక్రయాలు బహిరంగంగానే సాగాయి. గ్రామ పరిధిలో బెల్టుషాపులకు దుకాణాల నిర్వాహకులు కార్లు, ఆటోల్లో మద్యం బాటిళ్లు తీసుకొచ్చి అమ్మకాలు చేయించారు. ఎమ్మార్పీ కంటే రూ.50 అదనంగా అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఉత్సవాల్లో చివరి రెండు రోజులు శని, ఆదివారాల్లో పట్టపగలు బహిరంగంగానే మద్యం అమ్మకాలు చేపట్టినా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.