
ఘనంగా ‘ఓనం’ పండగ
● పదేళ్ల తర్వాత కేరళీయులతో
మమేకం కావడం ఆనందంగా ఉంది
● కళాశాల రోజులు గుర్తుకొచ్చాయి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(బృందావనం): మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పురమందిరంలో ఆదివారం ఓనం మహోత్సవాలు – 2025 ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఒ.ఆనంద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ అయిన తాను 10 సంవత్సరాల క్రితం కేరళను వీడానన్నారు. వృత్తి బాధ్యతల నడుమ కేరళీయులైన మలయాళీయులతో జరిగిన ఏ పండగల్లో, సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలగలేదన్నారు. నేడు ఓనం వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కళాశాల రోజులు గుర్తుకొస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. మాతృభూమిలో ఉన్నట్లు ఉందన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గొలగమూడిలో నిర్మించనున్న ఆయుర్వేదిక్ హాస్పిటల్‌కు తనవంతు సహకారం అందజేస్తానని తెలిపారు.
● నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ గొలగమూడి దగ్గర నిర్మితమయ్యే ఆయుర్వేదిక్ హాస్పిటల్‌కు రూ.2 లక్షలు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు.
● 25 కళా సంఘాల అధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సుమారు మూడు వేలకు మందికి పైగా మలయాళీయులు 23 సంవత్సరాలుగా ‘ఓనం’ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు పీజీ గోపి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు బిందు దివాకరన్, ఎంకే నందకుమార్, ఎ.మురుగన్, మధు పులియత్, వినోదిని ప్రమోద్, పి.సిద్దోష్, పచ్చప్పన్, సీఎస్.శివరామ, సాదికా అన్సారి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ మలయాళీయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జ్యోతి శ్రీధర్ ఆర్థిక సహాయంతో ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు. జిల్లాలో వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన 10 మంది సీనియర్ సిటిజన్స్‌ను ఘనంగా సత్కరించారు. దోర్నాల హరిబాబు పాల్గొన్నారు.

ఘనంగా ‘ఓనం’ పండగ