
ఎరువు.. మరింత బరువు
● యూరియా కొరత సాకుతో అదనపు వసూలు ● ఆందోళనలో అన్నదాతలు
ఏడాది కాలంలో పెరిగిన ధరలు
ఎరువు రకం గతేడాది ధర ప్రస్తుత ధర
20ః20ః0ః13 రూ.1,300 రూ.1,400
10ః26ః26 రూ.1,470 రూ.1,800
14ః35ః14 రూ.1,700 రూ.1,800
పొటాష్ రూ.1,535 రూ.1,900
సింగిల్ సూపర్
పాస్పేట్ రూ.580 రూ.640
ప్రైవేటు డీలర్ల దందా
ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న వివిధ పైర్లకు యూరియాతో పాటు పలు రకాల కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. కానీ రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు యూరియా కావాలంటే ఇతర కాంప్లెక్స్ ఎరువులు, కాల్షియం, పొటాషియం, నానో డీఏపీ, నానో యూరియా కొనాలంటూ షరతులు పెడుతున్నారు. అలాగే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో డీఏపీ ఎరువుకు కూడా అదనపు వసూలు చేస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే యూరియా, డీఏపీ సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు నిబంధనలు పెడుతూ అదనంగా ఇతర ఎరువులు తమకు అంటగడుతున్నారని డీలర్లు వాపోతున్నారు. దీంతో డిమాండ్ ఉన్న ఎరువులను ధరలు పెంచి అమ్మాల్సి వస్తోందని, లేదా ఇతర రకాల ఎరువులు కొనాలి అని షరతులు పెడుతున్న మాట వాస్తవమే అని కొందరు వ్యాపారులు ఒప్పుకుంటున్నారు.
పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు
ప్రస్తుతం జిల్లాలో వరితో పాటు మిరప, బొప్పాయి, అరటి, ఇతర ఉద్యాన వన తోటలు సాగులో ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కంది, అలసంద, మినుము తదితర అపరాల సాగు చేస్తున్నారు. ఈ పైర్ల సాగు కోసం యూరియా డీఏపీ ఎక్కువగా వాడుతున్నారు. దీనికి తోడు జిల్లాలో విస్తారంగా సాగులో ఉన్న జామాయిల్‌కు ధర తక్కువగా ఉన్నందున యూరియా వాడుతున్నారు. కానీ వ్యవసాయాధికారులు జామాయిల్ సాగు చేసే రైతులకు యూరియా ఇవ్వడం లేదని, వారు కాంప్లెక్స్ ఎరువులు మాత్రమే వాడాలని చెబుతున్నా అమలు కావడం లేదు. డీఏపీ కొంతమేర అందుబాటులో ఉంది. అయితే ప్రైవేటు డీలర్లు అదనపు ధర వసూలు చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటంతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో నష్టాలు వస్తాయని రైతులు అందోళన చెందుతున్నారు. పచ్చిరొట్ట ఎరువులు విస్తారంగా సాగు చేసి భూమిలో కలియదున్నితే చాలా వరకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించే అవకాశం ఉంది. కానీ పచ్చిరొట్టగా సాగు చేసే పిల్లి పెసర, జనుము, జీలగలు ప్రభుత్వం రాయితీపై నామమాత్రంగా సరఫరా చేసింది. దీంతో చాలా మంది రైతులు బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలు చెల్లించి పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫలితంగా పైరు సాగు చేసినప్పటి నుంచి కోత వరకు రసాయన ఎరువుల వినియోగంపై ఆధారపడుతున్నారు. దీంతో ఎరువుల వినియోగం పెరిగి రైతులపై భారం పడుతోంది.
కూటమి ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. పెరిగిన సాగు ఖర్చులకు తోడు ఎరువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. యూరియా కొరత పేరుతో వ్యాపారులు ఎరువుల ధరలు పెంచి రైతులపై మరింత భారం మోపుతున్నారు. పంటలకు ప్రధానంగా అవసరమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ప్రతి ఏడాది క్రమేణా పెరుగుతుండడం అన్నదాతలపై
అదనపు భారంగా మారింది.
– ఉదయగిరి

ఎరువు.. మరింత బరువు