
లోపాలు తలెత్తితే చర్యలు తప్పవు
● 38.4 శాతం మంది
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
● ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం మనందరి బాధ్యత అని, ఎక్కడైనా లోపాలు తలెత్తితే చర్యలు తప్పవని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అన్నారు. నగరంలోని విద్యుత్‌భవన్‌లో శనివారం ఆయన టౌన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా విద్యుత్ సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వచ్చిన ఫిర్యాదులు, లో–ఓల్టేజీ సమస్య, విద్యుత్ ఫీడర్స్‌లో తరచూ తలెత్తే అంతరాయాలకు సంబంధించిన గణాంకాలు తన వద్ద ఉన్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ లైన్ల లోపాలు ముందుగా గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలని, ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఫోన్లకు వచ్చే ఫిర్యాదులను నమోదు చేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది హెడ్ క్వాటర్స్‌లోనే ఉండాలని, పీఎం సూర్యఘర్‌పై అవగాహన కలిగించాలని, పెండింగ్ బిల్లులను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలపై 1912, వాట్సాప్ నంబర్ 91333 31912లకు ఫిర్యాదు చేయాలని కోరారు.
పలు సబ్‌స్టేషన్ల తనిఖీ
నగరంలోని డీఎస్సార్ సబ్‌స్టేషన్, కోవూరు తాలూకా ఆఫీసు వద్ద ఉన్న సబ్‌స్టేషన్‌లను ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కోవూరు డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంతర విద్యుత్ సరఫరాపై 38.4 శాతం మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. అధికారులు తరచూ సబ్‌స్టేషన్లను తనిఖీ చేస్తూ ఉండాలని ఆదేశించారు. విద్యుత్ చౌర్యం, అడిషనల్ లోడ్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తరచూ ఫెయిల్ అవుతున్నాయని మండిపడ్డారు. అనంతరం సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ విజయన్, నోడల్ అధికారి శేషాద్రి బాలచంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శ్రీధర్, రమేష్‌చౌదరి, డీఈఈలు అశోక్, సునీల్, కిరణ్, మధుసూదన్‌రెడ్డి, సతీష్, సురేంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.