
సంపూర్ణ అక్షరాస్యతకు కృషి
కొడవలూరు: సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేద్దామని అక్షరాంధ్ర జిల్లా నోడల్ అధికారి మస్తాన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొడవలూరు జెడ్పీ హైస్కూల్లో అక్షరాస్యత వలంటీర్లకు శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని సంపూర్ణ అక్షరాస్యతతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామస్థాయిలోని అక్షరాస్యత వలంటీర్‌లు సాయంత్రం రెండు గంటల సమయం కేటాయించి చదువు చెప్పాలన్నారు. ప్రజలు వేలిముద్రలు వేయకుండా చదువు నేర్చుకుని చైతన్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీడీఓ ఎ.వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మండలాన్ని వంద శాతం అక్షరాస్యతగా తీర్చిదిద్దుదామని కోరారు. కార్యక్రమంలో అక్షరాంధ్ర సూపర్‌వైజర్ శిరీష, ఎంఈఓలు జి.వసంతకుమారి, ఎన్.అంకయ్య, ఏపీఎం కృష్ణవేణి, హెచ్‌ఎం సత్యనారాయణ పాల్గొన్నారు.