
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో చోరీకి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి నిందితుడి వివరాలను వెల్లడించారు. వెంకటేశ్వరపురం రైలువీధిలో సయ్యద్ షబ్బీర్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన ఈనెల 20వ తేదీన కుటుంబంతో కలిసి ఉదయగిరిలో గంధ మహోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగుడు ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని పది సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితుడు అదే ప్రాంతానికి చెందిన అరవ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై కె.భోజ్యానాయక్, సిబ్బంది పాల్గొన్నారు.